రాబోయే ఏళ్లలో దేశంలోకి 900 విమానాలు

25 Dec, 2017 19:03 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లలో  ఒకటైన భారతదేశంలో విమాన యాన సంస‍్థలు చాలా దూకుడును ప్రదర్శిస్తున్నాయి.  ముఖ్యంగా ప్రాంతీయ మార్గాల్లో   భారీ ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే 900 విమానాలను అదనంగా ప్రారంభించనున్నాయి. ఇతర రవాణా సంస్థలతో పాటు, దేశీయ  ఎయిర్‌లైన్స​ మొత్తం 900 కన్నా ఎక్కువ విమానాలను ప్రారంభించనున్నాయని అధికారిక సమాచారం తెలిపింది.

అధికారుల డేటా ప్రకారం.. బడ్జెట్‌ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, ఎయిర్‌ఏషియా తమ విమానాల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమయ్యాయి.  ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో భాగంగా పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం, రానున్న సంవత్సరాల్లో  దేశీయ విమాన సంస్థలు మరో 900 విమానాలను ప్రారంభించనున్నాయి. ఇందులో ఒక్క ఇండిగోనే ఏకంగా 448 కొత్త విమానాలను తీసుకురానుంది. ఇండిగో వద్ద 150 విమానాలున్నాయి. వచ్చే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో మరో 448 విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 399 ఏ320 విమానాలు కాగా.. 49 ఏటీఆర్‌లు.

మరో ప్రధాన పోటీదారు ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌ కూడా ఇదే ప్రణాళికలతో ఉంది. 2018-23 మధ్య 157 కొత్త విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 57 విమానాలున్నాయి.  
మరో బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ మరో నాలుగేళ్లలో 119 ఏ320 విమానాలను కొనుగోలు చేసి అంతర్జాతీయ సేవలను మొదలుపెట్టనుంది. గో ఎయిర్‌ వద్ద ప్రస్తుతం 34 విమానాలున్నాయి. ఎయిర్‌ఏషియా కూడా మరో ఐదేళ్లలో 60 విమానాలను తీసుకురానుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం ఉన్న 107 విమానాలకు మరో 86 విమానాలను చేర్చనుంది.  ఇక ప్రభుత్వ రంగ ఎయిరిండియా 2019 మార్చి కల్లా మూడు బోయింగ్‌ విమానాలు, 16 ఏ320 విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 155 విమానాలున్నాయి.  


పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సమాచారంప్రకారం విస్తారా, ట్రూజెట్‌, జూమ్‌ ఎయిర్‌ లాంటి సంస్థలు కూడా మరో ఐదేళ్లలో కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నాయి. ఎయిర్ ఫ్రాన్స్ ఐదేళ్ల కాలంలో 60 విమానాలను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్ క్యారియర్ 14 విమానాలను కలిగి ఉంది.
 

మరిన్ని వార్తలు