దేశీ యాప్స్‌ హుషారు..

2 Jul, 2020 03:20 IST|Sakshi

షేర్‌చాట్, రొపొసొ, చింగారీ జోరు... 

చైనా యాప్స్‌పై నిషేధంతో పెరిగిన డౌన్‌లోడ్స్‌

సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో దేశీ యాప్స్‌కి ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. షేర్‌చాట్, రొపొసొ, చింగారీ మొదలైన యాప్స్‌ డౌన్‌లోడ్లు, యూజర్‌ సైన్‌ అప్స్‌ పెరిగాయి. గడిచిన రెండు రోజుల్లో భారీ వృద్ధి నమోదు చేసినట్లు ప్రాంతీయ భాషల్లోని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం షేర్‌చాట్‌ వెల్లడించింది. నిషేధం విధించిన సోమవారం సాయంత్రం నుంచి గంటకు 5 లక్షల డౌన్‌లోడ్స్‌ చొప్పున 1.5 కోటి పైచిలుకు డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయని వివరించింది.

షేర్‌చాట్‌ ఉపయోగాల గురించి యూజర్లు విస్తృతంగా తెలుసుకుంటున్నారని, ఇది తమకు మరింత ఊతమివ్వగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఫరీద్‌ ఎహ్‌సాన్‌ తెలిపారు. చైనా యాప్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఒక లక్ష పైగా పోస్టులు, వాటికి పది లక్షల మందికి పైగా యూజర్ల నుంచి లైక్‌లు వచ్చినట్లు పేర్కొన్నారు. 15 ప్రాంతీయ భాషల్లో షేర్‌చాట్‌కు 15 కోట్ల మంది పైగా రిజిస్టర్డ్‌ యూజర్లు, 6 కోట్ల మంది దాకా నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు.  

రాకింగ్‌ రొపొసొ...
ఇక, టిక్‌టాక్‌ యూజర్లలో చాలా మంది తమ యాప్‌వైపు మళ్లుతున్నట్లు షార్ట్‌ వీడియో యాప్‌ రొపొసొ వెల్లడించింది. ఇన్‌మొబీ గ్రూప్‌నకు చెందిన రొపొసొ 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండగా, 6.5 కోట్ల మేర డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. 1.4 కోట్ల వీడియో క్రియేటర్లు, ప్రతి నెలా 8 కోట్ల పైచిలుకు వీడియోలు తమ ప్లాట్‌ఫాంపై రూపొందుతున్నాయని రొపొసొ సహ వ్యవస్థాపకుడు మయాంక్‌ భంగాడియా తెలిపారు.

నైపుణ్యాలున్న భారతీయులందరూ వేగంగా వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడాలన్న ఉద్దేశంతో రొపొసొని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అటు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్న చింగారీ యాప్‌ వినియోగం కూడా  కొద్ది వారాలుగా గణనీయంగా పెరిగింది. గడిచిన 10 రోజుల్లో డౌన్‌లోడ్స్‌ సంఖ్య 5.5 లక్షల నుంచి ఏకంగా 25 లక్షలకు పెరిగింది.  

బాక్స్‌ఎన్‌గేజ్‌కు 10 రెట్లు స్పందన.. 
చైనా యాప్స్‌పై నిషేధం విధించిన 24 గంటల వ్యవధిలో తమ వెబ్‌సైట్‌ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య పది రెట్లు పెరిగిందని, ఒక లక్ష పైగా చేరుకుందని బాక్స్‌ఎంగేజ్‌డాట్‌కామ్‌ వెల్లడించింది.  కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఇది ప్రారంభమైంది. వీడియో షేరింగ్, డిజిటల్‌ సర్వీసులు మొదలైనవి ఈ ప్లాట్‌ఫాం అందిస్తోంది. ప్రస్తుతానికి పోర్టల్‌కు మాత్రమే పరిమితమైనా, త్వరలో మొబైల్‌ యాప్‌ కూడా ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక  హ్యాప్‌రాంప్‌కు చెందిన గోసోషల్‌ అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సొల్యూషన్‌కి గడిచిన కొద్ది రోజుల్లో యూజర్ల సంఖ్య 20 శాతం ఎగిసింది.

ప్రస్తుతం దీనికి 80,000 పైచిలుకు యూజర్లు ఉన్నారు.  హ్యాప్‌రాంప్‌లో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఇన్వెస్ట్‌ చేశారు. దేశీ యాప్స్‌ డౌన్‌లోడ్లు భారీగా ఎగిసినా ఇది తాత్కాలికం మాత్రమేనని, దీన్ని దీర్ఘకాలికంగా నిలబెట్టుకునేందుకు వ్యవస్థాపకులు గట్టి ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు శుభేంద్ర విక్రం తెలిపారు. అటు చైనా యాప్స్‌పై నిషేధం విధించిన 24 గంటల్లో సోషల్‌ మీడియా యాప్‌ ట్రెల్‌ ప్లాట్‌ఫాంపై ట్రాఫిక్‌ 500 శాతం పెరిగింది. అటు డిజిటల్‌ ఆడియో ప్లాట్‌ఫాం ఖబ్రీ రోజువారీ డౌన్‌లోడ్స్‌ 80 శాతం పెరిగింది.  

దేశీ డెవలపర్లకు మంచి చాన్స్‌.. 
టిక్‌టాక్‌పై నిషేధంతో 20 కోట్ల మంది పైచిలుకు భారతీయ యూజర్లు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్‌నర్‌ సీనియర్‌ రీసెర్చి డైరెక్టర్‌ నవీన్‌ మిశ్రా తెలిపారు. ‘అలాంటి భారీ ప్లాట్‌ఫాం రూపొందించే దిశగా భారతీయ డెవలపర్లకు ఈ నిషేధంతో మంచి అవకాశాలు దొరికినట్లయింది. ఇలాంటి పలు యాప్స్‌ ప్రస్తుతం ప్రారంభ స్థాయిలో ఉన్నాయి. భారతీయ వినియోగదారులిక వీటిని మరింత ఉధృతంగా వాడే అవకాశం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇక లక్షలకొద్దీ యువ యూజర్లు, బ్రాండ్లను తమ ప్లాట్‌ఫామ్స్‌వైపు ఆకర్షించేందుకు దేశీ సంస్థలకు ఇది మంచి అవకాశమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ దిగ్గజాల్లాగే స్థానిక డెవలపర్లకు కూడా అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తలు