ఇండియన్‌ బ్యాంక్‌ లాభం మూడింతలు

26 Apr, 2017 00:57 IST|Sakshi
ఇండియన్‌ బ్యాంక్‌ లాభం మూడింతలు

ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌  
న్యూఢిల్లీ/చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.94 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.320 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,523 కోట్ల నుంచి రూ.4,602 కోట్లకు చేరిందని పేర్కొంది.

స్థూల మొండి బకాయిలు రూ.8,827 కోట్ల నుంచి రూ.9,865 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.5,419 కోట్ల నుంచి రూ.5,607 కోట్లకు పెరిగాయని  తెలిపింది. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 6.66 శాతం నుంచి 7.47 శాతానికి, నికర మొండి బకాయిలు 4.2 శాతం నుంచి 4.39 శాతానికి చేరాయని వివరించింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ,  కేటాయింపులు మాత్రం రూ.968 కోట్ల నుంచి రూ.608 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

త్వరలో ఎఫ్‌పీఓ...
గత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్‌ పనితీరు బాగా ఉందని ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కిశోర్‌ ఖరత్‌ చెప్పారు. నిర్వహణ లాభాలు పెరగడం తదితర అంశాలు దీనికి కారణాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే  ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ)ద్వారా 82 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటాను75 శాతానికి  తగ్గించుకోనున్నామని వివరించారు.

నికర లాభం మూడు రెట్లు పెరిగిన నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియన్‌ బ్యాంక్‌ షేర్‌ 9 శాతం లాభపడి రూ.311 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ ఏడాది గరిష్ట స్థాయి, రూ.319ను తాకింది.

మరిన్ని వార్తలు