సంస్కరణలు బాగుంటే రేటింగ్ అప్గ్రేడ్

21 Sep, 2016 01:09 IST|Sakshi
సంస్కరణలు బాగుంటే రేటింగ్ అప్గ్రేడ్

మూడీస్ సంకేతాలు...
ఒకటి రెండేళ్లలో నిర్ణయం ఉంటుందని వెల్లడి
ప్రైవేటు పెట్టుబడులు మందగమనం,
ఎన్‌పీఏలు స్పీడ్ బ్రేకర్లన్న అభిప్రాయం
నేడు ఆర్థిక శాఖ అధికారులతో భేటీ

 న్యూఢిల్లీ: సంస్కరణలు తగిన విధంగా అమలు జరుగుతున్నాయని భావిస్తే- ఒకటి, రెండు సంవత్సరాల్లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ పెంచుతుందని ఆ సంస్థ సావరిన్ గ్రూప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మారియో డిరాన్ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనం, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య, సంస్కరణల నెమ్మది ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ స్పీడ్ బ్రేకరని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. ‘అధమ’ స్థాయికి ఇది ఒక అంచె ఎక్కువ. భారత్ రేటింగ్‌కు సంబంధించి  సెప్టెంబర్ 21న మూడీస్ ప్రతినిధులు, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఆర్థిక వ్యవస్థపై మూడీస్-ఇక్రా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా మారియో ఇంకా ఏం చెప్పారంటే..

ద్రవ్యలోటు, స్థిరత్వం దిశలో వేగవంతమైన చర్యలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే రుణ నిష్పత్తి తగ్గింపు, మౌలిక రంగం పురోగతికి చర్యలు, రుతుపవన ఒడిదుడుకుల సవాళ్ల తుది ఫలితానికి లోబడి రేటింగ్ అప్‌గ్రేడ్ ఉంటుంది.  అంతా సానుకూలంగా ఉంటే, 12 నుంచి 18 కాలంలో రేటింగ్ పెంపు అవకాశం ఉంది.

సంస్కరణల అమలు తీరు బాగుందనే భావిస్తున్నాం. అయితే ప్రైవేటు పెట్టుబడులు బలహీనతే సమస్యగా ఉంది.

పెండింగ్ సంస్కరణల్లో ముఖ్యంగా ఆరున్నాయి. భూ సమీకరణ బిల్లు, కార్మిక చట్టాల సంస్కరణ, మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి ప్రయోజనాలు తగిన విధంగా అమలు, పన్ను వ్యవస్థ అలాగే ప్రభుత్వ బ్యాంకింగ్‌లో సంస్కరణలు ఈ ఎజెండాలో కీలకమైనవి.

ఎన్‌పీఏలు, ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనానికి తోడు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, దేశంలో పలు సంస్కరణల్లో ఏకాభిప్రాయ సాధన ప్రతికూలాంశాల్లో ఉన్నాయి.

ఇన్వెస్టర్, కార్పొరేట్ స్థాయిల్లో విశ్వాసం మరింత బలపడాలి. తద్వారా వ్యాపార  వాతావరణం మెరుగుపడాలి.

జీఎస్‌టీ బిల్లు పార్లమెంటులో ఆమోదం, దివాలా కోడ్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం కట్టడి దిశలో ద్రవ్య, పరపతి విధాన చర్యలు క్రెడిట్ పాజిటివ్ కోణంలో కీలకాంశాలు. విధానపరమైన అంశాల్లో పారదర్శకత, విశ్వసనీయత, అవినీతి నిరోధానికి చర్యలు  ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాగత పటిష్టతకు దోహదపడుతున్న చర్యల్లో కొన్ని.

భారత్ బ్యాంకింగ్ బెటర్: బీఐఎస్
బ్యాంకింగ్ సవాళ్లకు సంబంధించి చైనాకన్నా భారత్ పరిస్థితులు బాగున్నాయని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఆయా అంశాలకు సంబంధించి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చినా భారత్ పరిస్థితి బాగుందని పేర్కొంది. 40 ఆర్థిక వ్యవస్థల డేటాను పరిశీలించి బీఐఎల్ రూపొందించిన డేటా ప్రకారం- 2016 మొదటి త్రైమాసికంలో భారత్  క్రెడిట్-జీడీపీ నిష్పత్తి మిగిలిన దేశాలతో పోల్చితే తక్కువగా - 2.9 శాతంగా ఉంది.  బ్రిక్ దేశాలలో ఇదే బెటర్. 2015 చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఇది 3 శాతం. చైనా విషయంలో ఈ రేటు భారీగా 28.4 శాతం నుంచి 30.1 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే విషయంగా వివరించింది. బ్రెజిల్-రష్యాల విషయంలో వరుసగా ఈ రేటు 4.6 శాతం, 3.7 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

ఎఫ్‌పీఐల పన్ను ఆందోళనలను పరిశీలిస్తాం: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పన్నుల విషయంలో లేవనెత్తిన కొన్ని ఆందోళలను పరిష్కరించడంపై దృష్టిపెడతామని ఆర్థిక శాఖ హామీనిచ్చింది. అదేవిధంగా భారత్‌లోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా సంస్థలు ఇచ్చిన సూచనలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి దిగ్గజాలతో సహా మొత్తం 35 ఎఫ్‌పీఐలకు చెందిన ప్రతినిధులు మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో దాదాపు మూడు గంటల పాటు సమావేశంలో పాల్గొన్నారు.

‘భారత్ ఆర్థిక వ్యవస్థ మూలాలు, ప్రస్తుత పటిష్టస్థాయిపై ఎఫ్‌పీఐల్లో ఎలాంటి సందేహాలు లేవు. మన మార్కెట్లో మరిన్ని అవకాశాల కోసం ఈ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. భవిష్యత్తు అత్యంత ఆశావహంగా కనిపిస్తోంది’ అని భేటీ తర్వాత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వ్యాపారాలకు అత్యంత సానుకూల దేశంగా భారత్‌ను నిలబెట్టడమే ఈ చర్యల ప్రధానోద్దేశమని ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా