భారత సీఈవోలకు సత్య నాదెళ్ల సలహా

24 Feb, 2020 13:37 IST|Sakshi

మూడు రోజుల పర్యటనకు భారత్‌కు చేరుకున్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో

ముంబైలో ‘ఫ్యూచర్ డీకోడ్  సీఈవో 2020’ ఈవెంట్‌లో  పాల్గొన్న సత్య నాదెళ్ల

సొంత డిజిటల్‌ టెక్నాలజీని పెంపొందించుకోవాలి - సత్య నాదెళ్ల

సాక్షి,ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల సోమవారం భారత్‌ చేరుకున్నారు. రానున్న డిజిటల్‌ యుగంల  దూసుకుపోయేందుకు  దేశంలోని వ్యాపారవేత్తలు తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతిలో మిళితమై ఉన్న ఈ సామర్ధ్యాలను భారత సీఈవోలు అలవర్చుకోవాలన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ చిన్న పెద్ద అన్ని రంగాల్లోనూ కీలక పాత్రపోషించనుందని, ఈ నేపథ్యంలో భారతదేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు 72 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ పరిశ్రమకు వెలువల ఉన్నాయని నాదెళ్ల తెలిపారు.  సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను క్లౌడ్‌కు మార్చడం, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రతపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. వచ్చే దశాబ్దంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి టెక్నాలజీలో తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను నిర్మించుకోవాలని నాదెళ్ల కంపెనీలను కోరారు. ఇది మరింత సమగ్ర వృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ముంబైలో  ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)  సీఎండీ రాజేష్ గోపీనాథన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.  మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య శిక్షణలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దేశంలోని యువతకు అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని, అలాగే త్వరగా నేర్చుకునే తత్వం వారి సొంతమని, అయితే దానిపై వారికి శిక్షణ అవసరమని ఆయన అన్నారు. 2020 నాటికి  ఎగైల్ టెక్నాలజీలను పూర్తిగా స్వీకరించడానికి  తాము సిద్ధంగా ఉన్నామని, తమ డెవలపర్‌లలో 59 శాతం మంది ప్రస్తుతం ఎగైల్‌పైనే పనిచేస్తున్నారని టీసీఎస్‌ సీఎండీ తెలిపారు. (చదవండి : ప్రీమియర్‌ డిజిటల్‌ సొసైటీగా భారత్‌ - అంబానీ)

భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశముందని రిలయన్స్‌ అధినేత ముకేశ​ అంబానీ పేర్కొన్నారు. జియో ఆవిష్కారం అనంతరం భారత్‌లో డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు.  తద్వారా దేశంలోని  మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. 


మైక్రోసాఫ్ట్‌ సీఈవోతో రిలయన్స్‌ అధినేత


 

మరిన్ని వార్తలు