కరోనా పేరిట కొత్త వ్యాపారాలు

19 Jun, 2020 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభనతో దేశంలో పలు వ్యాపారాలు దెబ్బతిని, ఎలా కోలుకోవాలో తెలియక వ్యాపారస్థులు లబోదిబోమంటుంటే కొందరు వ్యాపారులు  మాత్రం కరోనాను అడ్డుపెట్టుకొని వ్యాపారం చేసుకునేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నాయి.  వాటిల్లో పసుపుతో కూడిన పాల నుంచి కాలును కదిలిస్తే చేతిలో పడే శానిటైజర్లు, చేతులు ఉపయోగించకుండానే చేతికి పానీ పూరి అందించే మిషన్లూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఉన్న బ్రాండ్లకు లేబుళ్లు మార్చగా, మరికొన్ని కొంత బ్రాండ్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వస్తున్నాయి.

నోయిడా కేంద్రంగా పని చేస్తోన్న ఓ పాల ఉత్పత్తుల కంపెనీ ‘మదర్‌ డైరీ’ జూన్‌ 8వ తేదీన పసుపు మిలితమైన పాల డ్రింక్‌ను ఆవిష్కరించింది. కరోనా వైరస్‌ ఎదుర్కొనే రోగ నిరోధక శక్తీ పెరగాలంటే పసుపుతో కూడిన తమ పాల డ్రింక్‌ను పసందుగా సేవించండంటూ ప్రచారమూ మొదలు పెట్టింది. పసుపులో ఉండే కుర్కుమిన్‌ అనే పదార్థం మానవ రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుందంటూ ప్రచారం అందుకుంది. పసుపుతో కూడిన పాల డ్రింక్‌ అమెరికాలో కొన్నేళ్ల క్రితం ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే వారు దాన్ని అక్కడ ‘టర్మరిక్‌ లట్టీ’ అని వ్యవహరిస్తున్నారు.

భారత్‌లో కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నాలుగువేల సంవత్సరాల క్రితం నాటి ఆయుర్వేద మందులను, సేంద్రీయ పదార్థాలను భారతీయులు ఆశ్రయించడం, వాటిని విశ్వసించడం మనకు కనిపిస్తుంది. దేశంలో పలు రకాలు వ్యాపారాలు కలిగిన దాల్మియా గ్రూపయితే ‘కరోనా వైరస్‌ నిరోధక క్యాప్సుల్‌’ అంటూ గత మార్చ్‌ నెలలోనే ఓ మందును మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ క్యాప్సుల్‌లో 15 రకాలో వన మూలికలు ఉన్నాయని, అవి కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరంలో పెంచుతాయని, ముఖ్యంగా ఊపిరి తిత్తులో మంటను మటుమాయం చేస్తుందని ప్రచారం కూడా చేస్తోంది. ఆరోగ్యానికి అన్ని విధాల ఉపయుక్తమైనదంటూ, కొత్త శక్తికి, కొత్త కోరికకు, కొత్త తపనకు సరైన సమాధానమే తమ ఉత్పత్తులంటూ ఛాయోస్, స్టార్‌బక్స్, కేఫ్‌ కాఫీ డే లాంటి బ్రాండ్లు కూడా ప్రచారాన్ని ఊదరగొడుతున్నాయి. వీటిలో కొన్ని కొత్త బ్రాండులను విడుదల చేయగా, మరికొన్ని పాత బ్రాండ్లకే కొత్త వాణజ్య ప్రకటనలతో కొత్త లేబుళ్లు తొడుగుతున్నారు. హరీష్‌ బిజూర్‌ కన్సల్ట్స్, మింటల్‌ గ్రూప్‌ లాంటి సంస్థలు సలహాలు, సంప్రతింపుల్లో ఈ కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి.

తమిళనాడులోని ‘కలశలింగం అకాడమీ ఆఫ్‌ రిసర్చ్‌’ సంస్థ చేతులతో తాకనవసరం లేకుండా కాలుతో ఆపరేట్‌ చేసే శానిటైజర్‌ యంత్రాన్ని తయారు చేసి గత ఫిబ్రవరి నెలలోనే మార్కెట్‌లోకి విడుదల చేసింది. నేడు దానికి అనేక నమూనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి మార్కెట్లో 1300 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కరోనా పేరుతో సొమ్ము చేసుకునేందుకు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఉత్పత్తులకు ప్రజల నుంచి ఆశించిన ఆదరణ మాత్రం అంతంత మాత్రమే. (కుటుంబాలలో కరోనా వ్యాప్తి ఎక్కువ)

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పసుపుతో కూడిన పాలను తాగాల్సి వస్తే తానే స్వయంగా తయారు చేసుకుంటానుగానీ కంపెనీ ఉత్పత్తులపై ఆధార పడనని పుణేకు చెందిన ఓ విద్యావంతురాలు తెలిపారు. శరీరంలో దీర్ఘకాలనుగ్రహంగా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగతూ రావాలనిగానీ ఇప్పటికిప్పుడు పెంచుకుందామనే ఉద్దేశంతో కొత్త ఉత్పత్తులను ఆశ్రయిస్తే రోగ నిరోధక శక్తి పెరగడం ఏమోగానీ ‘ఆటో ఇమ్యూన్‌ డిసీస్‌’ వచ్చే ప్రమాదం ఉందని ‘యూనివర్శిటీ ఆఫ్‌ కెంటకీ’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న డాక్టర్‌ ట్రావిస్‌ థామస్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు