ఈసారి మళ్లీ 7.5 శాతం పైగా వృద్ధి.. 

20 Aug, 2018 00:54 IST|Sakshi

మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ విర్మాని 

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం 7.5% పైగా వృద్ధి రేటు సాధించే అవకాశాలు ఉన్నాయని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ విర్మాని చెప్పారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని భారత్‌ తనకు అనుకూలంగా మార్చుకోవాలని.. అమెరికాకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చని ఆయన సూచించారు. ‘గత ఏడేళ్లుగా హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్న భారత ఆర్థిక వృద్ధి మళ్లీ క్రమంగా రికవరీ బాట పట్టినట్లే కనిపిస్తోంది.

పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణను పణంగా పెట్టి ప్రభుత్వాలు రాజకీయ ఎజెండాతో ప్రజాకర్షక పథకాల కోసం భారీగా వ్యయాలు చేయడమన్నది దేశీయంగా స్థూల ఆర్థిక స్థిరత్వానికి ప్రధానమైన రిస్కు. చారిత్రకంగా చూస్తే ఎన్నికల ఏడాదిలో ప్రతీ ప్రభుత్వమూ ఇలాంటివి చేస్తూనే వస్తున్నాయి. దీన్ని గానీ అధిగమించగలిగితే ఈ ఆర్థిక సంవత్సరం భారత్‌ 7.5 శాతం పైగా వృద్ధి బాట పట్టగలదు‘ అని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు