భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌

24 Mar, 2020 15:59 IST|Sakshi

మంబై : గ్లోబల్‌ మార్కెట్ల ఊతంతో పాటు కరోనా మహమ్మారి కట్టడికి ఆర్థిక ప్యాకేజ్‌ ప్రకటించవచ్చనే అంచనాలతో స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఓ దశలో 1286 పాయింట్లు ఎగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆర్థిక ప్యాకేజ్‌ను తర్వాత ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించడంతో ఆరంభ లాభాలు కొంతమేర ఆవిరయ్యాయి. ఇక బ్లాక్‌ మండే విషాదాన్ని మరిపించేలా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దేశీయంగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో విమానయాన రంగ షేర్లు నష్టపోయాయి.

మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 692 పాయింట్ల లాభంతో 26,674 పాయింట్ల వద్ద ముగియగా, 190 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7801 పాయింట్ల వద్ద క్లోజయింది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి. షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్ రీబౌండ్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ ఈ స్ధాయిలో నిలదొక్కుకోవడం ముఖ్యమని, ట్రేడర్లు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు పుంజుకోవడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని మదుపరుల్లో ఆశలు నెలకొన్నాయి.

చదవండి : సెన్సెక్స్‌ 3,935 పాయింట్లు డౌన్‌

మరిన్ని వార్తలు