రూ.25 వేల కోట్లకు బాక్సాఫీస్ వసూళ్లు

26 Sep, 2016 01:07 IST|Sakshi
రూ.25 వేల కోట్లకు బాక్సాఫీస్ వసూళ్లు

2020 నాటికి సాధ్యమన్న డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయ చిత్ర పరిశ్రమ అంచలంచెలుగా ఎదుగుతోంది. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ స్థూల కలెక్షన్లు 2020 నాటికి 3.7 బిలియన్ డాలర్ల మార్కు (రూ.25 వేల కోట్లు)ను చేరుతుందని ‘డెలాయిట్ టౌచే తొమాసు ఇండియా’ అనే సంస్థ అంచనా వేసింది. దేశీయ చిత్ర పరిశ్రమ వృద్ధి అవకాశాలు, అడ్డంకులను ఈ సంస్థ నివేదికలో పొందుపరిచింది.

 ఆదాయాలు
{పస్తుతం భారత చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ ఆదాయాలు 2.1 బిలియన్ డాలర్లు (రూ.14వేల కోట్లు). ఏటా 11% చక్రగతి చొప్పున వృద్ధి చెందుతూ 2020 నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుంది.

భారతీయ చిత్ర పరిశ్రమ సినిమాల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్దది. ఏటా 20కు పైగా భాషల్లో 1,500 నుంచి 2,000 వరకు చిత్రాలు రూపొందుతున్నాయి.

సంఖ్యా పరంగా ఘనంగానే ఉన్నా పరిశ్రమ స్థూల ఆదాయాల విషయానికొస్తే విదేశాల కంటే తక్కువగానే ఉంది. అమెరికా, కెనడాలో ఏటా 700 సినిమాల వరకే నిర్మాణమవుతున్నా... బాక్సాఫీస్ ఆదాయాలు 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

బాలీవుడ్‌దే అగ్రస్థానం
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం ఆదాయంలో బాక్సాఫీసు కలెక్షన్లు 74 శాతంగా ఉన్నాయి. మిగతా ఆదాయం కేబుల్, శాటిలైట్, ఆన్‌లైన్ ప్రసార హక్కుల ద్వారా సమకూరుతోంది. ఇవి వేగంగా వృద్ధి చెందే విభాగాలని నివేదిక పేర్కొంది. ఏటా 15% చొప్పున 2020 వరకు వృద్ధి చెందుతాయని తెలిపింది. బాలీవుడ్ 43 శాతం ఆదాయ వాటాతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన 57 శాతం ప్రాంతీయ సినిమాల ద్వారా సమకూరుతోంది.

 వృద్ధి చోదకాలు
‘తలసరి ఆదాయం, పెరుగుతున్న మధ్యతరగతి వర్గం... టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో పరిశ్రమ సైతం స్థానిక మార్కెట్‌కే పరిమితం కాకుండా విదేశీ మార్కెట్లలోకి చొచ్చుకుపోతోంది. డిజిటైజేషన్ సామర్థ్యాలు, వీఎఫ్‌ఎక్స్ సాంకేతికతల వినియోగం పరిశ్రమకు వృద్ధి అవకాశాలు’ అని డెలాయిట్ తెలిపింది.

 సవాళ్లు: తగిన వసతులు లేమి ప్రధాన సమస్యగా ఉందని నివేదిక తెలిపింది. ‘సగటు టికెట్ ధర మన దగ్గర తక్కువగా ఉంది. క్లిష్టమైన పన్ను విధానం, వ్యయాలు పెరిగిపోవడం, నిధుల సాయం లభించకపోవడం, పైరసీ, బహుళ అంచెల పాలనా వ్యవస్థ, కఠినమైన సెన్సార్ నిబంధనలు...’ ఇవన్నీ సవాళ్లుగా నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు