ఈ కామర్స్‌ సంస్థలకు గడువు పొడిగింపు లేదు

1 Feb, 2019 05:17 IST|Sakshi

ఫిబ్రవరి 1 నుంచే కొత్త నిబంధనల అమలు

ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో ఈ కామర్స్‌ సంస్థలకు సవరించిన నిబంధనల అమలుకు ఫిబ్రవరి 1గా ఇచ్చిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువును కనీసం మూడు నెలల వరకైనా పొడిగించాలని ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు ఇప్పటికే కేంద్రాన్ని కోరాయి. ‘‘ఈ కామర్స్‌ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐల పాలసీ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత గడువును పొగించకూడదని నిర్ణయించాం’’ అని పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (డీపీఐటీ) పేర్కొంది.

కొత్త నిబంధనల కార్యాచరణను పూర్తిగా అర్థం చేసుకునేందుకు గాను గడువు పొడిగించాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ కేంద్రాన్ని కోరాయి. జూన్‌ 1వరకు పొడిగింపు ఇవ్వాలని అమెజాన్‌ కోరగా, ఆరు నెలల సమయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ కోరింది. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. నూతన నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులకు వివరించాయి. భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు తాము నిర్ణయించుకున్నామని, ఈ పెట్టుబడులకు రిస్క్‌ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ, దేశీయ వర్తకుల సమాఖ్య సీఏఐటీ మాత్రం గడువు పొడిగించొద్దని డిమాండ్‌ చేసింది. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలగొద్దని దేశీయ ఈ కామర్స్‌ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్‌ సైతం కోరాయి.

కాగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ తరహా ఈ రిటైలింగ్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై తమకు వాటాలున్న కంపెనీల ఉత్పాదనలను 25 శాతానికి మించి విక్రయించకుండా నిషేధిస్తూ గత డిసెంబర్‌ 26న కేంద్రం నూతన నిబంధనలను ప్రకటించింది. కొన్ని కంపెనీల ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ ప్లాట్‌ఫామ్‌పైనే విక్రయించే ఒప్పందాలను సైతం నిషేధించింది. మరోవైపు ప్రభుత్వం గడువు పొడిగించకపోతే నిబంధనల అమలుకు గాను ప్లాన్‌–బిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ సిద్ధం చేసుకున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం: అమెజాన్‌
నూతన నిబంధనల విషయంలో మరింత స్పష్టత కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, తమ కస్టమర్లు, విక్రయదారులపై ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కృషి చేస్తామని అమెజాన్‌ ప్రకటించింది. ‘‘అన్ని చట్టాలు, నిబంధనలను పాటించేందుకు కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకుని మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాం. ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం: స్నాప్‌డీల్‌
చిన్న ఈ కామర్స్‌ సంస్థలు స్నాప్‌డీల్, షాప్‌క్లూస్‌ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సచ్ఛీలమైన, బలమైన ఈ కామర్స్‌ రంగానికి ప్రభుత్వ నిర్ణయం దారితీస్తుందని స్నాప్‌డీల్‌ పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇది విజయం వంటిదని షాప్‌క్లూస్‌ సీఈవో విజయ్‌సేతి అభివర్ణించారు.

మరిన్ని వార్తలు