23% పెరగనున్న కొలువులు

11 Nov, 2014 01:04 IST|Sakshi
23% పెరగనున్న కొలువులు

ముంబై: భారత కంపెనీలు వచ్చే ఏడాది 23 శాతం అధికంగా ఉద్యోగాలనివ్వనున్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2015 వెల్లడించింది. అంతర్జాతీయ టాలెంట్ అసెస్‌మెంట్ కంపెనీ వీబాక్స్, భారత హెచ్‌ఆర్ అవుట్‌సోర్సింగ్, రిక్రూట్‌మెంట్ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్, ప్రొఫెషనల్ ఆన్‌లైన్ నెట్‌వర్క్ లింకెడిన్, సీఐఐలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.

 ఈ నివేదిక ప్రకారం...,
  వచ్చే ఏడాది ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అధికంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ రంగాల్లో 50 శాతం అధికంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండు రంగాల తర్వాత బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రంగాలు అధికంగా ఉద్యోగాలు కల్పిస్తాయి.

  తయారీ, టెలికాం, ఫార్మా రంగాల్లో హైరింగ్ తక్కువ స్థాయిలో ఉంటుంది.
  కార్యకలాపాలు నిర్వహించడానికి న్యూఢిల్లీ, ముంబై నగరాలు అనువైనవిగా పలు కంపెనీలు భావిస్తున్నాయి. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాధాన్యతా ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన విధానాల కోసం ఈ రెండు రాష్ట్రాలు సంస్కరణలు తెస్తున్నాయి.

  యువకులకే ఉద్యోగాలివ్వాలని 72 శాతానికి పైగా కంపెనీలు భావిస్తున్నాయి.
  మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది హైరింగ్‌లో పురుషులు, మహిళ ఉద్యోగుల వాటా 76:24 గా ఉండగా, ఈ ఏడాది  68:32 శాతంగా ఉంది. అయితే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, బీపీఓ, ఆతిధ్య రంగాల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది.

 2.7 లక్షల ఉద్యోగవకాశాలు
 ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ కొత్త కార్యాలయాల స్పేస్ లీజింగ్ 23 మిలియన్ చదరపుటడుగులుగా ఉందని ప్రోపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ తెలిపింది.  హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, పుణేలో వచ్చిన ఈ కొత్త ఆఫీస్ స్పేస్ లీజింగ్ కారణంగా 2.7 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించింది.

ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు అధికంగా కొత్త కార్యాలయాలను ప్రారంభించాయని  ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, తయారీ, ఇంజినీరింగ్, కన్సల్టింగ్, రీసెర్చ్ రంగాలు ఉన్నాయని వివరించింది. బెంగళూరులో అధికంగా ఉద్యోగావకాశాలు వస్తాయని, ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లు ఉంటాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు