1,000 యాప్స్‌ ఒకేసారి!

12 May, 2018 01:07 IST|Sakshi

 ఐఎంసీ సదస్సులో ఆవిష్కరణ

  సదస్సు సీఈవో రామకృష్ణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1,000 యాప్స్‌. అదీ ఒకే సమయంలో ఆవిష్కరణ. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) రెడీ అవుతోంది. దక్షిణాసియాలో రెండవ అతిపెద్ద డిజిటల్‌ టెక్నాలజీ సదస్సు, ప్రదర్శన న్యూఢిల్లీలో అక్టోబర్‌ 25–27 తేదీల్లో జరగనుంది. కేంద్ర టెలికం శాఖ, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌(సీవోఏఐ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 1,000 యాప్స్‌ ఆవిష్కరణ జరుగుతుందని సీవోఏఐ ప్రిన్సిపల్‌ అడ్వైజర్, ఐఎంసీ సీఈవో పి.రామకృష్ణ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ప్రత్యేక టన్నెల్‌లో యాప్స్‌ను ప్రదర్శిస్తామని చెప్పారు.

ఫోకస్‌ 5జీ పైనే..
ఐఎంసీ ప్రదర్శనలో 300కుపైగా కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. చైనా కంపెనీలు దీనికి అదనం. ‘90 శాతం కంపెనీలు విదేశాలకు చెందినవే. 5,000 మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొంటున్నారు. ఒక లక్ష మంది సందర్శిస్తారని అంచనా. నూతన ఉపకరణాలు, బ్రాండ్‌ ఆవిష్కరణలు ఉంటాయి.

గతేడాది జరిగిన మొదటి సదస్సు 4జీపై ఫోకస్‌ చేసింది. ఈసారి 5జీ టెక్నాలజీ లక్ష్యంగా కార్యక్రమం జరుగుతుంది. ఆసియాన్, బిమ్‌స్టెక్‌ దేశాల టెలికం మంత్రులతో సమ్మిట్‌ ఉంటుంది. దిగ్గజ సంస్థల గ్లోబల్‌ సీఈవోల శిఖరాగ్ర సదస్సు కార్యక్రమానికి హైలైట్‌ కానుంది’ అని వివరించారు.  

మరిన్ని వార్తలు