పెట్రోల్‌ ధరల తగ్గింపు.. జనం సంబరాలు

30 May, 2018 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ : గత 16 రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వాహనదారులకు చుక్కలు చూపించిన ఆయిల్‌ కంపెనీలు నేడు జనానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి. వాహనదారులకు ఊరట కల్పిస్తున్నామని.. పెట్రోల్‌ ధరలను 60 పైసలు, డీజిల్‌ ధరలపై 56 పైసలు తగ్గించామంటూ ప్రకటనలు ఇచ్చాయి. హమ్మయ్య.. కాస్తో కూస్తో ధరలు తగ్గాయి కదా..! అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అనూహ్యంగా మరో ప్రకటన చేసింది. రెండు మూడు గంటల వ్యవధిలోనే తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసా మాత్రమే తగ్గించామంటూ సవరణ ప్రకటన వెలువరించి జనంతో జోకులు చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయించే ధరలను పోస్టు చేసే తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య నెలకొందని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పునఃసమీక్షిస్తున్నామంటూ ప్రకటించింది. ఇంధన ధరల తగ్గింపు స్వల్పమేనని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పేర్కొంది.

ఈ పైసా తగ్గింపుతో తామేదో గొప్ప మనసును చాటుకున్నట్టు ప్రకటనలు ఇస్తూ.. ఆయిల్‌ కంపెనీలు జనాన్ని వేళాకోళం చేస్తున్నాయి. పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి జనం సంబురాలు చేసుకోండంటూ విడ్డూరపు ప్రకటనలు ఇవ్వడమేంటని ప్రజలు మండిపడుతున్నారు. పైసా తగ్గింపుతో తామేమీ పండుగ చేసుకోవాలంటూ ఆయిల్‌ కంపెనీలను దుమ్మెత్తి పోస్తున్నారు. పైసా తగ్గింపు ఎందుకని? అది ఎవరికి లాభమని? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయిల్‌ కంపెనీలు ఎంతమేర ధరలను అమలు చేస్తున్నాయి, వాటిని డీలర్లు ఏ మేరకు పాటిస్తున్నారు? అన్నది ప్రశ్నార్థకమే. ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలే ఒక్క పైసా తగ్గిస్తే, ఇంక డీలర్లేమీ అమలు చేస్తారంటూ మండిపడుతున్నారు.

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు ఎలాంటి చడీచప్పుడు లేకుండా.. ధరలను యథావిధిగా ఉంచిన కంపెనీలు, ఆ ఎన్నికలు అయిపోవడమే తమదే రాజ్యం అన్నంటూ వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వస్తున్నాయి. ఆ రోజు నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిందే కానీ, తగ్గింది లేదు. రికార్డు స్థాయిలో వాహనదారులను బాదేస్తూ.. తమ రెవెన్యూలను దండీగా లాగేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరల్లో మార్పులు చేపడతామని, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామంటూ రోజువారీ సమీక్షను చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రయోజనం అంటే.. ఎంతో అనుకుని సంబుర పడిపోతారని ముందే ఊహించిన ఆయిల్‌ కంపెనీలు, తాము తగ్గించేది ఒక్క పైసా, రెండు పైసలే అంటూ ఈ ప్రకటనలు చేస్తూ.. వాహనదారులను మరింత ఉడికిస్తున్నాయి.

చదవండి... (శుభవార్త : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి)

మరిన్ని వార్తలు