భారత్‌లో ఆన్‌లైన్‌ విద్యకు భారీ మార్కెట్‌

31 May, 2017 00:19 IST|Sakshi
భారత్‌లో ఆన్‌లైన్‌ విద్యకు భారీ మార్కెట్‌

2021 నాటికి రూ.12,500 కోట్లకు
గూగుల్, కేపీఎంజీ నివేదిక


న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ విద్యారంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా విద్యా కంటెంట్‌ వినియోగం పెరుగుతుండడంతో 2021 నాటికి ఈ మార్కెట్‌ 1.96 బిలియన్‌ డాలర్ల (రూ.12,544 కోట్లు సుమారు)కు చేరుకుంటుందని గూగుల్‌–కేపీఎంజీ నివేదిక పేర్కొంది. పెయిడ్‌ యూజర్లు (డబ్బులు చెల్లించి సేవలు పొందేవారు) 2016లో 16 లక్షల మంది ఉండగా... 2021 నాటికి వీరి సంఖ్య ఆరు రెట్ల వృద్ధితో 96 లక్షలకు చేరతారని అంచనా వేసింది. ఈ నివేదిక ‘భారత్‌లో ఆన్‌లైన్‌ విద్య: 2021’ పేరుతో విడుదలైంది. ఆన్‌లైన్‌లో విద్యా సంబంధిత సమాచారం కోసం అన్వేషించే వారి సంఖ్య గత రెండేళ్లలో రెండు రెట్లు, మొబైల్స్‌ ద్వారా వెతికే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది.

మొత్తం మీద ఈ విధంగా శోధించే వారిలో 44 శాతం మంది ఆరు మెట్రో నగరాలకు వెలుపలి నుంచే ఉండడం విశేషం. గత ఏడాది కాలంలో ఒక్క యూట్యూబ్‌ మాధ్యమం ద్వారానే విద్యా సంబంధిత కంటెంట్‌ వినియోగంలో నాలుగు రెట్ల పెరుగుదల కనిపించినట్టు నివేదిక తెలిపింది. ఆన్‌లైన్‌లో నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్‌ కోర్సులకు డిమాండ్‌ ఉందని పేర్కొంది. 26 కోట్ల మంది విద్యార్థులతో కూడిన ప్రాథమిక, సెకండరీ విద్యార్థుల విభాగం 2016లో రెండో అతిపెద్ద విభాగంగా ఉండగా, ఇది ఏటా 60 శాతం చొప్పున వృద్ధితో 2021 నాటికి 77.3 కోట్ల మందితో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆన్‌లైన్‌లో పరీక్షలకు సన్నద్ధమయ్యే విభాగం ప్రస్తుతం చిన్నగానే ఉన్నప్పటికీ... ఇది కూడా ఏటా 64 శాతం పెరుగుతూ 2021కి 51.5 కోట్లకు విస్తరిస్తుందని తెలిపింది. ఆన్‌లైన్‌ విద్యా విభాగం భారత్‌కు మల్టీ బిలియన్‌ డాలర్ల అవకాశాలను కల్పించనుందని గూగుల్‌ ఇండియా డైరెక్టర్‌ నితిన్‌ బావన్‌కులే పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు