కోవిడ్‌ : పరిస్థితి భయంకరంగా ఉంది

18 Feb, 2020 20:03 IST|Sakshi

 రెండు, మూడు నెలలకు సరిపడా స్టాక్‌ మాత్రమే వుంది - ఇండియా ఫార్మాస్యూటికల్ అలయన్స్

ఎప్పటికి సర్దుకుంటుందో పూర్తిగా అంచనా వేయలేకపోతున్నాం

సాక్షి, హైదరాబాద్ : కోవిడ్‌-19 వైరస్‌​ ప్రకంపనలు  దేశీయ ఫార్మ రంగాన్ని తాకనున్నాయి. చైనా నుండి ముడి పదార్థాల దిగుమతి  నిలిచిపోవడంతో పరిస్థితి భయంకరంగా ఉందని  (ఐపీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత పార్మా పరిశ్రమలో కేవలం రెండు, మూడు నెలల వరకు మాత్రమే సరిపడా ముడిపదార్థం నిల్వలు (యాక్టివ్ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్‌, ఏపీఐ) ఉన్నాయని తెలిపింది. మార్చి నెల నుంచి దిగుమతులు తిరిగి ప్రారంభమైతేనే పరిస్థితి చక్కబడే అవకాశాలున్నాయంటూ  ఆందోళన వ్యక్తం చేసింది.

చాలా క్లిష్టమైన, తీవ్రమైన పరిస్థితిలో భారతీయ ఫార్మా పరిశ్రమం ఉందని ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ  సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమి జరుగుతుందో ఎవరికీ పూర్తి అంచనాలేదనీ, పరిస్థితి ఎప్పటికి మెరుగుపడుతుందో లేదో ఊహించడం చాలా కష్టమని  తెలిపారు. కేవలం రెండు, మూడు నెలలకు సరిపడా ముడి పదార్థాలు మాత్రమే మిగిలి వున్నాయని జైన్ చెప్పారు. అయితే ప్రతీ రోజూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు  ఏపీఐలను యూరోపియన్‌ దేశాలనుంచి దిగుమతి చేసుకునే అవకాశం  కూడా ఉందన్నారు.

హైదరాబాద్‌లో ప్రారంభమైన (ఫిబ్రవరి17-19 తేదీల్లో) బయో ఏషియా-2020 సదస్సులో మాట్లాడుతూ సుదర్శన్ జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ వనరులపై తాము కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అలాగే కొన్ని ఏపీఐ తయారీ యూనిట్లకు వేగంగా పర్యావరణ అనుమతులు కోరినట్టు చెప్పారు. తద్వారా చైనాపై ఆధారపడటం తగ్గిందన్నారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం చైనా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే ఏపీఐల విలువ రూ .17,000 కోట్లు. ప్రపంచానికి జెనరిక్‌ మందుల ప్రధాన సరఫరాదారుగా ఉన్న చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడం ఫార్మా పరిశ్రమగా పెద్ద దెబ్బేనని, ఈ కొరత మరింత పెరిగే అవకాశం వుందని ఇప్పటికే పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత దేశానికి 70 శాతం కంపెనీలు చైనానుంచి దిగుమతయ్యే ఔషధాల మూలకాల మీదే ఆధారపడి వున్నాయి.   

చదవండి : కోవిడ్‌ : పరిశ్రమలకు ఆర్థికమంత్రి అభయం

మరిన్ని వార్తలు