కరోనా: 3 లక్షల ఐసోలేషన్ పడకలు సిద్ధం

31 Mar, 2020 16:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో భారతీయ రైల్వే శాఖ కూడా తన వంతు సాయం అందించేందుకు సిద్ధమైంది. 20 వేల రైల్వే  కోచ్‌లను కరోనా బాధితుల కోసం సిద్దం చేశామని మంగళవారం ప్రకటించింది. తద్వారా 3.2 లక్షల ఐసోలేషన్ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించింది. బోగిలోని ప్రతీ క్యాబిన్ ను ఒక రోగికి వసతి కల్పించేలా ఐసోలేషన్ వార్డుగా మార్చింది. కరోనా వైరస్ బాధితునికి అవసరమైన అన్ని సదుపాయాలకు వీలుగా వీటిని రూపొందించామని తెలిపింది. అలాగే పడకల మధ్య రెండు అడుగుల దూరాన్ని ఉంచడం కోసం మిడిల్ బెర్తులను తొలగించామని సంస్థ విడుదల చేసిన ఒక అధికారిక  ప్రకటనలో తెలిపింది. ఐదు జోనల్ రైల్వేలు  క్వారంటైన్  ఐసోలేషన్ కోచ్ లతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.

కోవిడ్ -19 రోగులకు  మరిన్ని సోలేషన్ వార్డులను రూపొందించే ప్రయత్నాలను రైల్వే మంత్రిత్వ శాఖ  ముమ్మరం చేసింది.  5 వేల బోగీలను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చే పని ఇప్పటికే ప్రారంభమైందని  మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా మరో 80వేల పడకలు సిద్ధం కానున్నాయని తెలిపింది. రైల్వే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, ఆయుష్మాన్ భారత్‌తో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ ఏడవ రోజుకు చేరుకుంది. దేశంలోకరోనా పాజిటివ్ సంఖ్య పెరుగతున్న నేపథ్యంలో కరోనా రోగులకు అవసరమైన అధునాతన పడకల అవసరాలను తీర్నునున్నామని  రైల్వే శాఖ ప్రకటించిన సంగతి విదితమే. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాల తయారీకిగాను లోకోమోటివ్ ప్రొడక్షన్ యూనిట్లను ఉపయోగించుకునే పనిని భారతీయ రైల్వే ఇప్పటికే ప్రారంభించింది. దీనికితో 266 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులకు మార్చాలని నార్త్-వెస్ట్రన్ రైల్వే (ఎన్‌డబ్ల్యుఆర్) యోచిస్తోంది.

మరిన్ని వార్తలు