బేయర్‌–మోన్‌శాంటో డీల్‌కు సీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌

23 May, 2018 00:40 IST|Sakshi

కొన్ని షరతుల మేరకు కొనుగోలుకు అనుమతి

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీని 66 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయాలన్న జర్మనీ సంస్థ బేయర్‌ ప్రతిపాదనకు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (మార్కెట్లో పారదర్శకమైన పోటీ ఉండేలా చూసే సంస్థ) కొన్ని సవరణలకు లోబడి ఆమోదం తెలియజేసింది. పెట్టుబడుల ఉపసంహరణ తదితర చర్యల్ని బేయర్‌ తీసుకోవాల్సి ఉంటుందని సీసీఐ వర్గాలు తెలిపాయి. మోన్‌శాంటోను కొనుగోలు చేయనున్నట్టు 2016 సెప్టెంబర్‌లోనే బేయర్‌ ప్రకటించింది.

చాలా దేశాల్లో మోన్‌శాంటో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కనుక భారత్‌ సహా 30 దేశాల్లో ఈ డీల్‌కు పలు నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంటుంది. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా జన్యుమార్పిడి పంటల సాగు విషయంలో తీవ్ర వ్యతిరేకతను మోన్‌శాంటో ఎదుర్కొంటుండగా, ఈ డీల్‌కు సీసీఐ ఆమోదం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోన్‌శాంటోను అంతర్జాతీయంగా సొంతం చేసుకునే క్రమంలో సీసీఐ ఆమోదం ఓ మైలురాయిగా బేయర్‌ పేర్కొంది.

రెండు భిన్నమైన కంపెనీల కలయిక వల్ల పరస్పర ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం తెలిపింది. విత్తనాల రంగంలో మోన్‌శాంటో అంతర్జాతీయ అగ్రగామి కంపెనీగా ఉండగా, పెస్టిసైడ్స్‌ విభాగంలో బేయర్‌ దిగ్గజ కంపెనీ. ఈ రెండు కంపెనీలు భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేయర్‌ ఇండియా వార్షిక టర్నోవర్‌ 2017లో రూ.4,700 కోట్లుగా ఉంది. ఈ రెండింటి విలీనం కారణంగా దేశీయంగా ఈ రంగంలో పోటీకి విఘాతం కలుగుతుందా అన్న దానిపై సీసీఐ ఈ ఏడాది జనవరిలోనే ప్రజాభిప్రాయాల్ని స్వీకరించింది. అంతిమంగా ఆమోదం తెలియజేసింది.  

మరిన్ని వార్తలు