30 బిలియన్‌ డాలర్లు కావాలి

26 Oct, 2018 00:30 IST|Sakshi

రూపాయి బలోపేతానికిదే మందు

ఇండియా రేటింగ్స్‌ అంచనా

సగటున 69.79కి తీసుకురావచ్చని విశ్లేషణ  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీకి ఇండియా రేటింగ్స్‌ గురువారం కీలక సూచనలు చేసింది. ఇందుకుగాను ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) నుంచి కనీసం 30 బిలియన్‌ డాలర్లను సమీకరించాలన్నది ఇండియా రేటింగ్స్‌ విశ్లేషణ. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో రూపాయి విలువను సగటున 69.79కి తీసుకుని రావచ్చని పేర్కొంది. 2013లో ఇలాంటి చర్యలే తీసుకున్న విషయాన్ని కూడా తన తాజా నివేదికలో ప్రస్తావించింది. రూపాయి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దాదాపు 8.3% పతనమైన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని  ముఖ్యాంశాలు చూస్తే...

గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, రూపాయి విలువ 15 శాతం పతనమయింది. గడచిన ఆరు నెలల్లో పతనం 8.3 శాతంగా ఉంది. ఆరు నెలల్లో డాలర్‌ మారకంలో సగటు విలువ  68.57గా ఉంది.  ఇతర దేశాల కరెన్సీలూ బలహీనమయినా, రూపాయి అంతకుమించి పతనమవడం గమనార్హం.  
   దువ్వూరి సుబ్బారావు నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రఘురామ్‌ రాజన్‌  2013లో అప్పట్లో రూపాయిని నిలబెట్టడానికి ఎన్‌ఆర్‌ఐల నుంచి 25 బిలియన్‌ డాలర్ల సమీకరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  
   2015–2019 మధ్య రూపాయి పతనం 3 శాతమే. 20 ఏళ్ల సగటు చూసినా (1999–2018) వార్షిక పతనం దాదాపు 3 శాతంగానే ఉంది.  
    డాలర్‌ బలోపేతం, కమోడిటీ ధరలు ప్రత్యేకించి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, దీనితో దేశం నుంచి తరలుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ద్రవ్యలోటుపై ఆందోళనలు వంటి పలు అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు.  
    ఒక దేశ కరెన్సీ బలహీనపడితే, ఆ దేశ ఎగుమతులు పెరిగే అవకాశం ఉండటం సహజమే. అయితే రూపాయికన్నా ఎక్కువగా ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతుండటం వల్ల తాజా పరిస్థితి (రూపాయి పతనం) నుంచి భారత్‌ ప్రయోజనం పొందలేకపోతోంది. పైగా ముడి చమురు సహా కొన్ని ఉత్పత్తులను భారత్‌ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది.  
 ఐదు నెలల తర్వాత మొదటిసారి సెప్టెంబర్‌ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా, –2.15 శాతం క్షీణత నమోదుకావడం మరో అంశం.  ఇదే సమయంలో దిగుమతులు 10.45 శాతం (41.9 బిలియన్‌ డాలర్లు) పెరిగాయి.


73.27 వద్ద రూపాయి...
డాలర్‌ మారకంలో రూపాయి విలువ గురువారం 11 పైసలు బలహీనపడింది. 73.27 వద్ద ముగిసింది. విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ వంటి అంశాలు ఫారెక్స్‌ మార్కెట్ల రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని డీలర్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత ఒడిదుడుకులతోసాగి బుధవారం 41పైసలు లాభంతో మూడు వారాల గరిష్టం 73.16కు చేరింది.   


ఆరేళ్ల గరిష్టానికి పసిడి
పండుగలు, రూపాయి బలహీనత నేపథ్యం 
న్యూఢిల్లీ: పసిడి ధర  ఇక్కడి స్పాట్‌ మార్కెట్‌లో ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. 99.99, 99.5 స్వచ్ఛత ధరలు 10 గ్రాములకు రూ.125 చొప్పున పెరిగి, వరుసగా రూ. 32,625, రూ.32,475కు చేరాయి. 2012 నవంబర్‌ 29 తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. అప్పట్లో 99.99 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32.940ని తాకింది. మూడు రోజుల్లో న్యూఢిల్లీలో పసిడి దాదాపు రూ.405 పెరిగింది. ఒకపక్క పండుగల సీజన్, మరోవైపు డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత పసిడి ధరను పెంచుతున్నాయి.

అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్‌కు (31.1గ్రా) 1,250 డాలర్లలోపు ఉన్నా, రూపాయి బలహీనతలు బంగారం దిగుమతులపై మరింత భారాన్ని పెంచుతోంది. ఈక్విటీల బలహీనతలు, డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతంపై అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం ప్రారంభించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్తరాసే రాత్రి 10 గంటల సమాయానికి అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ ధర 1,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో రూ.31,911 వద్ద ట్రేడవుతోంది.   

మరిన్ని వార్తలు