విలువైన వస్తువులుగా పాడైపోయిన ఫోన్లు

20 Apr, 2018 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ : రోజురోజుకి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. దాంతో పాటు ఈ-వ్యర్థాలు కూడా గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ-వేస్ట్‌ వల్ల వచ్చే ముప్పు కూడా అత్యధికమే. ఈ ముప్పు భారీ నుంచి పర్యావరణాన్ని రక్షించడానికి, పాడైపోయిన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లాంటి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను విలువైన వస్తువులుగా మార్చి మళ్లీ వాడుకునేలా చేయడానికి పూర్వ ఐఐటీ విద్యార్థి, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఓ ఇండియన్‌ సైటిస్ట్‌ ప్రపంచంలోనే తొలి మైక్రో ఫ్యాక్టరీ రూపకల్పనకు సాయం అందించారు. ఈ ఫ్యాక్టరీ లాంచింగ్‌లో ఆయనదే కీలక పాత్ర. ప్రొఫెసర్‌ వీణ సహజ్వాలా.... యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌లో మెటీరియల్‌ సైంటిస్ట్‌, సిడ్నీ వర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్ సస్టైనబుల్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ‌(ఎస్‌ఎంఏఆర్‌టీ)లో డైరెక్టర్‌. ఆయన ఒకప్పుడు అంటే  1986లో ఐఐటీ కాన్పూర్‌లో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేశారు. వీణ సహజ్వాలా ప్రస్తుతం మైక్రో ఫ్యాక్టరీల లాంచింగ్‌లో కీలక పాత్ర పోషించారు.

ఈ-వేస్ట్‌ మైక్రో ఫ్యాక్టరీ అనేదే ప్రపంచంలో మొదటిదని, యూఎస్‌ఎస్‌డబ్ల్యూలో దీన్ని టెస్ట్‌ చేసినట్టు వీణ చెప్పారు. ఇలాంటి మైక్రో ఫ్యాక్టరీలు గ్లాస్‌, ప్లాస్టిక్‌, టింబర్‌ లాంటి కన్జ్యూమర్‌ వేస్ట్‌ను కమర్షియల్‌ మెటీరియల్స్‌గా, ప్రొడక్ట్‌లుగా మార్చనున్నట్టు తెలిపారు. ఎస్‌ఎంఏఆర్‌టీ సెంటర్‌లో సుదీర్ఘంగా సైంటిఫిక్‌ రీసెర్చ్‌ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీలు పర్యావరణానికి ముప్పు కలిగించే పెద్ద మొత్తంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను నిర్మూలించనున్నట్టు తెలిపారు. ఇటీవలే ఎస్‌ఎంఏఆర్‌టీ సెంటర్‌ ల్యాబోరేటరీస్‌లో ఈ మైక్రో ఫ్యాక్టరీని లాంచ్‌ చేశారు.  మైక్రో ఫ్యాక్టరీలు సమీపంలో ఉన్న ఈ-వ్యర్థాలను సేకరించి, వాటిని ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తుల మాదిరిగా రూపాంతరం చేయనున్నారు. అంతేకాక ఇవి కన్జ్యూమర్‌ డిమాండ్‌కు తగ్గట్టు ఉండనున్నాయి. కంప్యూటర్‌ సర్క్యూట్‌ బోర్డులను విలువైన మెటల్‌ అలోయ్స్‌గా, ఈ-డివైజ్‌ల గ్లాస్‌, ప్లాస్టిక్‌ను ఇండస్ట్రియల్‌ గ్రేడ్‌ సెరామిక్స్‌లో వాడే మైక్రో మెటీరియల్స్‌గా మార్చనున్నారు. 50 చదరపు మీటర్లలో ఈ మైక్రో ఫ్యాక్టరీలు ఆపరేట్‌ చేయవచ్చు. ఎక్కడ స్టాక్‌ ఎక్కువగా ఉంటే అక్కడ వాటిని ఏర్పాటు చేయొచ్చు. ద్వీపకల్ప మార్కెట్లకు, మారమూల, స్థానిక ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.  వీణ సహజ్వాలా 2005లో ఆయన గ్రీన్‌ స్టీల్‌ను కనుగొన్నారు. దీంతో రీసైకిల్‌ ప్లాస్టిక్స్‌ను, రబ్బర్‌ టైర్లను స్టీల్‌ మేకింగ్‌లో వాడుతున్నారు. 

మరిన్ని వార్తలు