10200పైన నిఫ్టీ ప్రారంభం

9 Jun, 2020 09:21 IST|Sakshi

130 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు 

దేశీయ మార్కెట్‌ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 34500 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 10202 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రికవరిపై ఆశావహన అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరుపరుస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌, మీడియా రంగాలకు చెందిన షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మెటల్‌, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.22శాతం లాభంతో 21,234.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్‌ -19  కేసుల సంఖ్య రోజురోజూకు పెరుగుతుండటం, కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో ప్రపంచబ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను తగ్గించడం తదితర అంశాలు సూచీలను ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు పురిగొల్పవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. హీరో మోటోకార్ప్‌, బాంబే డైయింగ్‌తో పాటు సుమారు 23 కంపెనీలు మార్చి క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఛైర్మన్‌తో పాటు సిడ్బి ఛైర్మన్‌ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. 

అమెరికాలో నిన్నరాత్రి నాస్‌డాక్‌ ఇండెక్స్‌ మరోసారి జీవితకాల గరిష్టాన్ని తాకి 1.13శాతం లాభంతో ముగిసింది. అలాగే ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ ఇండెక్స్‌ సైతం 1శాతానికి పైగా లాభంతో ముగిశాయి. నేడు ఆసియాలో జపాన్‌, కొరియా దేశాలకు చెందిన ఇండెక్స్‌లు తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభంతో కదులుతుంది. అనేక దేశాలలో కరోనా వైరస్ ప్రేరేపిత లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో చమురు ధరలకు డిమాండ్‌ పెరిగింది. నేటి ఉదయం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 41.13డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

యూపీఎల్‌, సన్‌ఫార్మా, టాటాస్టీల్‌, టెక్‌ మహీంద్రా, హిదాల్కో షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. ఐషర్‌మోటర్స్‌, విప్రో, ఐఓసీ, ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌ షేర్లు అరశాతం నుంచి 2శాతం నష్టపోయాయి.

మరిన్ని వార్తలు