పనికిరాని గిఫ్ట్‌.. మనమే ఫస్ట్‌!!

22 Dec, 2016 01:22 IST|Sakshi
పనికిరాని గిఫ్ట్‌.. మనమే ఫస్ట్‌!!

హైదరాబాద్‌లో 71% గిఫ్ట్‌లు అక్కరకు రానివే
50%తో చండీగఢ్, 38%తో ముంబై ఆ తరవాత
దేశమంతటా ఇదే ధోరణి;  నాలుగింట ఒకటి వేస్టే
దుస్తులు, ఆహారం, వంటింటి ఉపకరణాలే అధికం
ఓఎల్‌ఎక్స్‌–ఐఎంఆర్‌బీ ‘పనికిరాని’ సర్వేలో ఆసక్తికర విషయాలు
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘మొన్న మా అబ్బాయి పుట్టినరోజుకు శ్రీలక్ష్మి వచ్చి డ్రెస్‌ ఇచ్చింది. కానీ ఏం లాభం? మా వాడికి చిన్నదైపోయింది’’ అంటూ తన చెల్లెలు దగ్గర వాపోయింది అనూరాధ. ‘‘సర్లే! ఎవరోఒకరికిమనం కూడా గిఫ్ట్‌గా ఇచ్చేద్దాం’’ అని సలహా ఇచ్చింది ఆమె చెల్లి. నిజానికిది వీళ్లిద్దరి సమస్యే కాదు. దాదాపు ఇండియా అంతా ఉంది. ఎందుకంటే వాళ్లకు ఇతరులిచ్చే బహుమతుల్లో మెజారిటీ వారికి పనికిరానివేనట!!.అలా పనికిరాని గిఫ్ట్‌ల జాబితాలో దుస్తులు, ఆహార వస్తువులు, వంటింటి ఉపకరణాలదే మొదటి స్థానమని ఓఎల్‌ఎక్స్‌–ఐఎంఆర్‌బీ చేసిన సర్వే తేల్చింది. పనికిరాని బహుమతుల జాబితా ఇంటింటా పెరుగుతోందని కూడా

ఇది వెల్లడించింది. సర్వేలోని పలు ఆసక్తికర అంశాలివిగో...
మీకెవరైనా బహుమతిస్తే అది అక్కరకు రావాలి. కనీసం ఏడాదిలోగా దాన్ని వాడే అవకాశముండాలి. అలా లేకుంటే అది పనికిరాని బహుమతేనని ఈ సర్వే తేల్చింది. వేరొకరిచ్చిన బహుమతులు తమకు నచ్చకుంటేవాటిని ఇతరులకివ్వటాన్ని ఈ సర్వే ‘ఓఎల్‌ఎక్స్‌ ఓమ్ని ప్రెజెంట్‌’గా పేర్కొంది. సర్వే చేసిన కుటుంబాల్లో 24 శాతం ఓమ్ని ప్రజెంట్‌కు బాగా అలవాటు పడ్డాయి. గతేడాది ఇది 20 శాతంగా ఉంది. 14 శాతం మంది తమకుపనికిరాని వాటిని పడేస్తామని చెప్పగా... 7 శాతం మంది మాత్రం విక్రయిస్తామన్నారు. ఇక దానం చేస్తామన్నది మాత్రం 5 శాతమేనట!!.

26 శాతానికి చేరిన పనికిరాని గిఫ్ట్‌లు..
అవసరం లేని వస్తువులను బహుమతులుగా పొందడమనేది 2014లో 16 శాతం ఉండగా.. 2016 నాటికి 26 శాతానికి చేరింది. ప్రతి ఇంటా సగటున 4 ఆహార వస్తువులు, 3 గిఫ్ట్‌ వోచర్లు, 3 క్లోతింగ్‌ ఐటమ్స్, 2 వంటింటి ఉపకరణాలు, 2 బొమ్మలు ఇష్టపడని బహుమతులుగా స్టోరేజీలో పడున్నాయి. వీటిని ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు సందర్భం కోసం వేచి చూస్తున్నారు కూడా. అయితే రీ గిఫ్టింగ్‌లో తమ ఇమేజీని దృష్టిలోపెట్టుకొని అప్రమత్తంగా ఉండేవారూ పెరుగుతున్నారు. రీ గిఫ్టింగ్‌ చేయకపోవటానికి 31 శాతం మంది ‘ఆ వస్తువును బట్టి నన్ను అంచనా వేస్తారు. ఆ గిఫ్ట్‌ విలువ నాకు తెలియదనుకుంటారు’ అని కారణం చెప్పారు.అత్యధికంగా రీ గిఫ్ట్‌ అయ్యే వాటిలో దుస్తులదే అగ్రస్థానం. 2014–15లో 5 శాతంగా ఉన్న దుస్తుల రీ గిఫ్టింగ్‌.. 2015–16 నాటికి 33 శాతానికి చేరింది. ఆ తర్వాతి స్థానంలో గిఫ్ట్‌ ఓచర్లు, ఎలక్ట్రానిక్స్, షో పీసెస్‌ నిలిచాయి.

హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌...
ఏడాది కాలంలో ఇష్టపడని బహుమతి ఒక్కటైనా అందుకున్న నగరాల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం. ఇక్కడి 71 శాతం కుటుంబాలు ఇష్టపడని వస్తువుల్ని పొందారు. చండీగఢ్‌ 50, ముంబై 38 శాతంతో తర్వాతి స్థానాల్లోనిలిచాయి. చెన్నైలో 2 శాతం, భువనేశ్వర్‌లో 6 శాతం, పుణెలో 7 శాతం కుటుంబాలు మాత్రమే తాము ఇష్టపడని వస్తువులను బహుమతిగా పొందినట్లు తెలియజేశాయి.

‘పనికిరాని’ సర్వే ఎందుకు చేశామంటే..
నచ్చిన వస్తువును కొనటానికి తాము ఇష్టపడని బహుమతులను విక్రయించడం ఈ మధ్య బాగా పెరిగింది. ఓఎల్‌ఎక్స్‌లో ఈ జాబితా పెరుగుతుండటంతో అసలు వారికి చేరుతున్న బహుమతులేంటి? అందులోఉపయోగపడేవి ఎన్ని? పడనివి ఎన్ని? అనే అంశాలను లోతుగా అధ్యయనం చేయటానికి ఈ సర్వే చేశాం. 16 నగరాల్లోని 5,800 కుటుంబాలకు చెందిన 19–60 ఏళ్ల వయస్కులు 5,314 మందిని కలిసి ఈ సర్వే చేశాం.
– అమర్‌జిత్‌సింగ్‌ బాత్రా, ఓఎల్‌ఎక్స్‌ ఇండియా సీఈఓ

ఇష్టపడని బహుమతులివే...
దుస్తులు, ఆహార వస్తువులు, వంటింటి ఉపకరణాలు,
ఇంట్లో పేరుకుపోయిన గిఫ్ట్‌లివే...
బెడ్‌షీట్స్, ఎలక్ట్రానిక్స్, పర్సనల్‌ వస్తువులు

మరిన్ని వార్తలు