యూఎస్‌ రియల్టీలో భారతీయులు

25 Jul, 2018 00:22 IST|Sakshi

ఈబీ–5 ఇన్వెస్ట్‌మెంట్‌ వీసాపై ఆసక్తి

60 శాతం మంది రియల్టీవైపే మొగ్గు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూఎస్‌ గ్రీన్‌కార్డ్‌ ఎందరో భారతీయుల కల. దాన్ని నెరవేర్చుకోవటానికి కొందరు సంపన్నులు ఈబీ–5 మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మార్గంలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించడం ద్వారా యూఎస్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.

పెట్టుబడిదారు, ఆయన భార్య, పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. సాధారణంగా గ్రీన్‌కార్డ్‌కు 15–20 ఏళ్లు పడుతుంది. ఈబీ–5 ద్వారా 18 నెలల్లోపే కండిషనల్‌ గ్రీన్‌కార్డ్‌ పొందవచ్చు. భారత్‌ నుంచి ఈబీ–5 దరఖాస్తుదారుల్లో 60% మంది రియల్టీలో పెట్టుబడికి ఆసక్తి కనబరుస్తున్నారని ‘కెన్‌ ఏమ్‌’ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా, మిడిల్‌ ఈస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభినవ్‌ లోహియా మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. న్యూయార్క్‌ కేంద్రంగా సేవలందిస్తున్న ‘కెన్‌ ఏమ్‌’ ఇమిగ్రేషన్‌ ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.

వీసా నిబంధనలతో..: ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక వీసా, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు కఠినమయ్యాయని, ఈ మధ్య వీసాల రెన్యువల్స్‌ తిరస్కరణ పెరిగిందని, దీంతో ఈబీ–5 వీసాలకు డిమాండ్‌ పెరిగిందని అభినవ్‌ వెల్లడించారు. ‘ఎంట్రప్రెన్యూర్స్, టెకీల నుంచి ఈ దరఖాస్తులు పెరుగుతున్నాయి.

యూఎస్‌లో ఉన్నవారికి ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయటం చాలా సులువు. అయితే పెట్టుబడి మొత్తాన్ని 2018 సెప్టెంబరు నుంచి 9.25 లక్షలు లేదా 13 లక్షల డాలర్లు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత్‌ నుంచి దరఖాస్తులు 80–90 శాతం తగ్గే అవకాశముంది. నిజానికి 5 లక్షల డాలర్లు చాలా తక్కువ. అదే ఆస్ట్రేలియాలో అయితే కనీసం 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి’ అని ఆయన వివరించారు.  

ఈ ఏడాది 700 దరఖాస్తులు..
గతేడాది భారత్‌ నుంచి 500 దాకా ఈబీ–5 దరఖాస్తులొచ్చాయని, ఈ ఏడాది 700 దరఖాస్తులొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు అభినవ్‌ చెప్పారు. చైనా, వియత్నాం తర్వాత అత్యధిక అప్లికేషన్లు భారత్‌ నుంచే వస్తున్నట్లు చెప్పారాయన. ఇక కెన్‌ ఏమ్‌ 2016లో 50, 2017లో 97 దరఖాస్తులను స్వీకరించింది. ఈ ఏడాది ఇది 200 రావచ్చని భావిస్తోంది. హైదరాబాద్‌ నుంచి గత రెండేళ్లలో 10 అప్లికేషన్లను ప్రాసెస్‌ చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు