అమెరికా చికెన్ దిగుమతుల కేసులో భారత్ అప్పీలు!

1 Dec, 2014 00:06 IST|Sakshi
అమెరికా చికెన్ దిగుమతుల కేసులో భారత్ అప్పీలు!

న్యూఢిల్లీ: అమెరికా నుంచి చికెన్ ఇతరత్రా పౌల్ట్రీ దిగుమతులపై బ్యాన్ చెల్లదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఇచ్చిన తీర్పును భారత్ సవాలు చేసే అవకాశం ఉంది. అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై భారత్ విధించిన నిషేధం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని డబ్ల్యూటీఓ కమిటీ ఈ ఏడాది అక్టోబర్14న తీర్పునివ్వడం తెలిసిందే. కాగా, దీనిపై అప్పీలు చేసే అంశాన్ని కేంద్ర వాణిజ్య శాఖ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం పశుసంవర్ధన, డెయిరీ, ఫిషరీస్ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించాయి.

డబ్యూటీఓ వివాదాల పరిష్కార కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అప్పీలేట్ విభాగం వద్ద సవాలు చేసేందుకు 60 రోజుల గడువు ఉంటుంది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ భయాలతో 2007లో భారత్ అమెరికా నుంచి పౌల్ట్రీ సహా పలు వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధం విధించింది. అయితే, 2012 మార్చిలో దీనిపై డబ్ల్యూటీఓను అమెరికా ఆశ్రయిం చడం... భారత్‌కు వ్యతిరేకంగా ఇటీవలే తీర్పురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
 

మరిన్ని వార్తలు