ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారం

16 Jun, 2018 00:17 IST|Sakshi

మేలో ఆరు నెలల గరిష్టానికి ఎగుమతులు

29 బిలియన్‌ డాలర్లుగా నమోదు

14.62 బిలియన్‌ డాలర్లకు వాణిజ్యలోటు

ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి  

న్యూఢిల్లీ: భారతదేశ ఎగుమతుల విలువ 2018 మే నెలలో  28.86 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2017 మే నెలలో ఎగుమతులతో పోల్చితే వృద్ధి రేటు 20.18 శాతంగా నమోదయ్యింది. ఇంత స్థాయి వృద్ధిరేటు ఆరు నెలల్లో ఇదే తొలిసారి. 2017 నవంబర్‌లో ఎగుమతుల్లో 30.55 శాతం వృద్ధి నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యాంశాలు చూస్తే...

ఎగుమతులు పెరిగినా, వాణిజ్యలోటు తీవ్రత ఆందోళనకు గురిచేస్తోంది. ఎగుమతులు– దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. ఇది మే నెలలో 14.62 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది జనవరిలో 16.28 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు నమోదయ్యింది.  
 మే నెలలో దిగుమతులు కూడా భారీగా 14.85 శాతంగా నమోదయ్యాయి. విలువ రూపంలో 43.48 బిలియన్‌ డాలర్లు.  
 పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఇంజనీరింగ్‌ రంగాలు ఎగుమతుల పెరుగుదలకు దారితీశాయి. అయితే జీడిపప్పు, ముడి ఇనుము, జౌళి, రత్నాలు–ఆభరణాలు, హస్తకళల ఉత్పత్తులు, కార్పెట్‌ విభాగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది.  
 పసిడి దిగుమతులు భారీగా 29.85 శాతం పతనమయ్యాయి. విలువ 4.96 బిలియన్‌ డాలర్ల నుంచి 3.48 బిలియన్‌ డాలర్లకు పడ్డాయి.  

ఏప్రిల్‌–మే నెలల్లో...: ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు– ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు 13 శాతం పెరిగి 54.77 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 9.72 శాతం పెరిగి 83.11 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 28.34 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 27.09 బిలియన్‌ డాలర్లు.   

మరిన్ని వార్తలు