భారత్‌ ఎగుమతులు బాగున్నాయి

27 Dec, 2018 02:11 IST|Sakshi

అయితే పూర్తి సంతృప్తి లేదు

వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్‌ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రక్షణాత్మకవాదం, మందగమనం, వాణిజ్య యుద్ధం, దిగుమతి సుంకాలుసహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ,  దేశ ఎగుమతులు పెరుగుతుండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. 2011–12 నుంచి దేశ ఎగుమతుల విలువ 300 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2017–18లో 10% వృద్ధితో 303 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంపు! 
అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశీయ పరిశ్రమ, తయారీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు ప్రభు పేర్కొన్నారు. ఈ కమోడిటీ భారీ దిగుమతులపై అల్యూమినియం పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్యూమినియం స్క్రాప్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం 2.5%. ప్రైమరీ అల్యూమినియంపై 7.5%. రెండింటిపై ఈ సుంకాన్ని 10 శాతానికి పెంచాలన్న డిమాండ్‌ వస్తోంది. దీనితోపాటు ఈ కమెడిటీ దిగుమతిపై కనీస దిగుమతి ధర, దిగుమతులపై కోటా నిర్దేశం వంటి మరికొన్ని పరిమితులూ విధించాలని దేశీయ పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది.  

మరిన్ని వార్తలు