ఏప్రిల్‌లో ఎగుమతుల ఊరట!

16 May, 2018 01:15 IST|Sakshi

5.17 శాతం వృద్ధి

ఇంజనీరింగ్, ఫార్మా, రసాయనాల విషయంలో మంచి ఫలితాలు

వాణిజ్యలోటు 13.7 బిలియన్‌ డాలర్లు  

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు ఏప్రిల్‌లో 5.17 శాతం వృద్ధి నమోదుచేసుకున్నాయి. అంటే 2017 ఏప్రిల్‌తో పోల్చితే తాజా సమీక్ష నెలలో ఎగుమతులు 5.17% పెరిగాయన్నమాట. విలువ రూపంలో ఇది 25.9 బిలియన్‌ డాలర్లు. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో మంచి ఫలితం ఒక శుభారంభం. ఇంజనీరింగ్‌ (17.63 శాతం), ఫార్మా (13.56), రసాయనాల (38.48), నూలు, చేనేత వస్త్రాలు (15.66), ప్లాస్టిక్, నిలోనియం (30.03 శాతం) రంగాల  నుంచి ఎగుమతులు చక్కని పనితీరును ప్రదర్శించాయి.

దిగుమతులు 4.6 శాతం పెరుగుదల
ఇక ఏప్రిల్‌లో దిగుమతులు 4.6 శాతం పెరిగి 39.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఒక ఆందోళనకర పరిణామమని విశ్లేషణ. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది.

సేవలు ఇలా...:సేవల ట్రేడ్‌ విషయంలో గణాంకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. విలువ రూపంలో 7 శాతం పెరిగింది. విలువ రూపంలో 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు సేవల విభాగం నుంచి జరిగాయి. ఈ విభాగంలో దిగుమతులు కూడా చూస్తే మిగులు 6.5 బిలియన్‌ డాలర్లు.  

మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
మార్చి నెలలో ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణతలోకి వెళ్లినా, మరుసటి నెలలోనే కొంత సానుకూల ఫలితం రావడం కొంత ఊరటనిచ్చే అంశం.
    పెట్రోలియం, రత్నాలు, ఆభరణాలేతర ఎగుమతుల విలువ ఏప్రిల్‌లో 19.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతుల విలువ 17.7 బిలియన్‌ డాలర్లు.
 చమురు దిగుమతుల విలువ 10.4 బిలియన్‌ డాలర్లు. పెరుగుదల రేటు 41.45 శాతం.అంతర్జాతీయంగా చమురు ధరల భారీ పెరుగుదల దీనికి నేపథ్యం.
 చమురేతర దిగుమతుల విలువ 29.21 బిలియన్‌ డాలర్లు.  అయితే ఈ విలువ 2017 ఏప్రిల్‌తో పోల్చితే 4.3 శాతం (30.5 బిలియన్‌ డాలర్లు) తగ్గింది.

>
మరిన్ని వార్తలు