అన్ని రంగాలూ కలిసొచ్చాయి! 

1 Mar, 2018 00:33 IST|Sakshi
వృద్ధి రేటు

మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి దూకుడు

7.2 శాతంగా నమోదు

క్యూ1, క్యూ2లతో పోల్చితే మంచి ఫలితం

వ్యవసాయం, తయారీ, నిర్మాణం, సేవల్లో రికవరీ  

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్‌ త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) బాగుంది. 7.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయిలో 5.7 శాతానికి పడిపోగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) కొంచెం కోలుకుని 6.3 శాతంగా నమోదయ్యింది. అయితే ఇప్పుడు ఈ రేటును 6.5 శాతంగా సీఎస్‌ఓ సవరించింది.  కీలకమైన వ్యవసాయం, తయారీ, నిర్మాణం, సేవల రంగాల్లో రికవరీ కనిపించడం 3వ త్రైమాసికానికి కలిసి వచ్చింది. భారత్‌ జీడీపీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతం ఉంటే, తయారీ, వ్యవసాయం రంగాల వాటా దాదాపు చెరి 15 శాతం ఉంది.  

మొత్తంగా 6.6 శాతం ఉండొచ్చు... 
ఆర్థిక సంవత్సరం మొత్తంమీద (2017 ఏప్రిల్‌– 2018 మార్చి) భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం ఉండే అవకాశం ఉందని బుధవారంనాడు విడుదల చేసిన గణాంకాల సందర్భంగా కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) పేర్కొంది. ఇంతక్రితం అంచనాలకన్నా (6.5 శాతం) ఇది 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం)  ఎక్కువ.  2016–17లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం. 2016–17 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 7.5 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, ఇప్పుడు రేటు కొంచెం ఆ స్థాయికి చేరుకోవడం విశేషం.  

విలువలు చూస్తే... 
సీఎస్‌ఓ గణాంకాల ప్రకారం– 2017–18లో జీడీపీ విలువ (2011–12 స్థిర ధరల వద్ద) 130.04 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. 2016–17లో ఈ విలువ 122 లక్షల కోట్లు. (మొదటి సవరిత అంచనా ప్రకారం).   

వివిధ రంగాలు చూస్తే... 
తయారీ: స్థూల విలువ జోడింపు (జీవీఏ) కింద 3వ త్రైమాసికంలో తయారీ రంగం 8.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2వ త్రైమాసికంలో ఈ రేటు 6.9 శాతం.  
వ్యవసాయం: ఈ రంగం విషయంలో ఈ రేటు 2.7 శాతం నుంచి 4.1 శాతానికి పెరిగింది.  
నిర్మాణం: ఈ విభాగంలో వృద్ధి రేటు 6.8 శాతం. 2వ త్రైమాసికంలో రేటు 2.8 శాతం.  
సేవలు: జీడీపీలో మెజారిటీగా ఉన్న ఈ కీలక విభాగంలో 6.4 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది.  

 

మరిన్ని వార్తలు