2025కి జీడీపీ 325 లక్షల కోట్లు!

23 Apr, 2018 01:25 IST|Sakshi

ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ సుభాష్‌చంద్ర

పరిగెత్తేందుకు ఏనుగు సిద్ధం: ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌: దేశ జీడీపీ 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.325 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గర్గ్‌ అన్నారు. గత కొన్ని సంవత్సరాల కాలంలో చేపట్టిన సంస్కరణలు ఫలితాలనివ్వడం మొదలైందని చెప్పారు. 2017లో భారత్‌ జీడీపీ 2.44 లక్షల కోట్ల డాలర్లుగా (రూ. 161 లక్షల కోట్లు) అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి వేగాన్ని సంతరించుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొనగా, భారత ఏనుగు పరిగెత్తేందుకు సిద్ధంగా ఉందని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

వాషింగ్టన్‌లో శనివారం జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో వీరు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గైర్హాజరు నేపథ్యంలో భారత బృందానికి గార్గ్‌ నేతృత్వం వహించారు. 2018లో 7.4 శాతం వృద్ధితో భారత్‌ తిరిగి ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందే పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని గార్గ్‌ పేర్కొన్నారు. జీఎస్టీ, ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్సీ కోడ్‌ (ఐబీసీ), బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, మౌలిక రంగంలో పెట్టుబడులు వృద్ధికి తోడ్పడతాయని చెప్పారు.

గడిచిన కొన్నేళ్లలో ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, డిజిటల్‌ ఆర్థిక సేవల విస్తృతికి చర్యలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. స్థిరమైన వృద్ధికి కోసం మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకు వివిధ మార్గాల ద్వారా వనరుల సమీకరణకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

డిజిటైజేషన్‌ విభాగంలో భారత్‌నెట్‌ ప్రాజెక్టు తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలను అధిక వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించినట్టు తెలిపారు. దీనిద్వారా 20 కోట్లమందికి బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జన్‌ధన్‌ యోజన కింద బ్యాంకింగ్‌ సేవలను పేదవారికి చేరువ చేసినట్టు చెప్పుకొచ్చారు.

వృద్ధికి వేగం: ఉర్జిత్‌ పటేల్‌  
భారత ఆర్థిక వ్యవస్థ 2017–18 ఆర్థిక సంవత్సరంలో బలమైన పనితీరు చూపించిందని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. పెట్టుబడులకు తిరిగి డిమాండ్‌ ఏర్పడటం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో వృద్ధి వేగం అందుకుంటుందని చెప్పారు. తయారీ రంగం, విక్రయాలు, సామర్థ్య వినియోగం పుంజుకోవడం, సేవల రంగంలో బలమైన కార్యకలాపాలు, సాగు ఆశాజనకంగా ఉండటం వంటివి గడిచిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి తోడ్పడినట్టు ఉర్జిత్‌ పటేల్‌ వివరించారు.

అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతుండటంతో ఎగుమతులకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొని పెట్టుబడులు పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ కలసి వాస్తవ జీడీపీని 2018–19లో 7.4 శాతానికి తీసుకెళతాయన్నారు. 2016 నవంబర్‌ నుంచి ద్రవ్యోల్బణం మధ్యకాలిక లక్ష్యం 4 శాతం లోపే ఉందని, ఇటీవల కూరగాయల ధరల కారణంగా కొంత పెరిగినప్పటికీ తిరిగి 4.3 శాతానికి దిగొచ్చిందన్నారు. ప్రభుత్వం ద్రవ్య క్రమశిక్షణకు కట్టుబడి ఉందన్నారు.

సంస్కరణల అమలు కీలకం
స్థిరమైన ఆర్థిక సంస్కరణల బలంతో ‘ఏనుగు పరిగెట్టేందుకు సిద్ధంగా ఉందని’ భారత్‌ను ఉద్దేశించి ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ చాంగ్‌యాంగ్‌ అన్నారు. నాలుగేళ్ల సంస్కరణల మార్గం నేపథ్యంలో ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు తనకు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. సంస్కరణల విషయంలో మోదీ సర్కారు చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు.

అయితే, ఈ సంస్కరణలను అమలు చేయడంతోపాటు, స్థిరమైన వృద్ధికి బలమైన బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లు అవసరమని గుర్తు చేశారు. భారత్‌కు ఎన్నో మంచి ప్రణాళికలు ఉన్నప్పటికీ ప్రగతి ఆశించిన మేర లేదని విదేశీ ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నట్టు చాంగ్‌యాంగ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు