వృద్ధి అంచనాలు కట్‌!!

12 Oct, 2017 00:36 IST|Sakshi

ఈ ఏడాది భారత్‌ జీడీపీ వృద్ధిరేటు 7 శాతానికే పరిమితం: ప్రపంచ బ్యాంకు

డీమోనిటైజేషన్,  జీఎస్‌టీ ప్రభావాలే కారణం

ప్రైవేటు పెట్టుబడులకు అడ్డంకులు

వృద్ధికి ప్రతికూలమని హెచ్చరిక

వాషింగ్టన్‌: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీపరమైన ప్రతికూల అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా భారత వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాయి. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణం కాగలవని కుదిస్తున్నట్లు పేర్కొంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక.. తయారీ, సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక అంతర్గతంగా అడ్డంకుల కారణంగా ప్రైవేట్‌ పెట్టుబడులు మందగించాయని, ఇది దేశ వృద్ధి అవకాశాలపై మరింతగా ఒత్తిడి పెంచగలదని హెచ్చరించింది. రెండేళ్లకోసారి విడుదల చేసే దక్షిణాసియా ఆర్థిక స్థితిగతుల నివేదికలో ప్రపంచబ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టమైన 5.7 శాతానికి మందగించిన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సైతం భారత వృద్ధి అంచనాలను 6.7 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. ఇది గతంలోని రెండు అంచనాల కన్నా అర శాతం, చైనా అంచనాలైన 6.8 శాతం కన్నా తక్కువ కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది.

2018లో 7.3 శాతం..
పెద్ద నోట్ల రద్దుతో కలిగిన అంతరాయాలు, జీఎస్‌టీపై అనిశ్చితి మొదలైన అంశాలతో భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం పడిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అయితే, ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల మధ్య సమతౌల్యత ఉండేలా తగు విధానాలు పాటిస్తే 2018లో వృద్ధి కొంత మెరుగుపడి 7.3 శాతం స్థాయికి చేరగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. నిలకడగా వృద్ధి సాధిస్తుంటే పేదరికం తగ్గుముఖం పడుతుందని, అయితే అసంఘటిత ఎకానమీకి ప్రయోజనం చేకూర్చే చర్యలపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది.

దక్షిణాసియాపైనా ప్రభావం..
భారత వృద్ధి రేటు మందగించడం అటు మొత్తం దక్షిణాసియా ప్రాంత వృద్ధి రేటుపైనా ప్రతికూల భావం చూపిందని వరల్డ్‌ బ్యాంకు తెలిపింది. ఫలితంగా తూర్పు ఆసియా.. పసిఫిక్‌ తర్వాత రెండో స్థానానికి దక్షిణాసియా పడిపోయిందని వివరించింది. 2015–16లో 8%గా ఉన్న వాస్తవ జీడీపీ గత ఆర్థిక సంవత్సరం 7.1 %కి, అటుపైన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.7%కి తగ్గిందని తెలిపింది. 7వ వేతన సవరణ కమిషన్‌ సిఫార్సుల అమలు, సాధారణ వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు మొదలైన వాటి ఊతంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ వినియోగం పెరిగినప్పటికీ.. ప్రభుత్వపరమైన పెట్టుబడులు తగ్గడంతో స్థూలంగా డిమాండ్‌ మందగించిందని బ్యాంకు వివరించింది. 2018 ప్రారంభంలోనూ జీఎస్‌టీ వల్ల ఆర్థిక అనిశ్చితి ఉండనున్నప్పటికీ.. వృద్ధి గతి  కొంత పుంజుకోగలదని తెలిపింది. మొత్తం మీద 2020 నాటికి వృద్ధి క్రమక్రమంగా మెరుగుపడి 7.4 శాతం స్థాయికి చేరుకోగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇటీవల ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల ఊతంతో ప్రైవేట్‌ పెట్టుబడుల రికవరీ, పెట్టుబడులకు అనువుగా పరిస్థితులు మెరుగుపడటం వంటివి ఇందుకు తోడ్పడగలవని తెలిపింది. జీఎస్‌టీ, దివాలా కోడ్‌ అమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు తీసుకునే చర్యలు మొదలైనవి పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పనకు దోహదపడగలవని అభిప్రాయపడింది.

డౌన్‌గ్రేడ్‌ స్వల్పకాలికమైనదే: ఐఎంఎఫ్‌
ఈ ఏడాది భారత వృద్ధి మందగించవచ్చన్న తమ అంచనాలు చాలా స్వల్పకాలికమైనవేనని, స్థూలంగా చూస్తే దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అత్యంత సానుకూలంగానే ఉందని ఐఎంఎఫ్‌ ఎకనమిక్‌ కౌన్సిలర్‌ మారిస్‌ ఓస్ట్‌ఫెల్డ్‌ పేర్కొన్నారు.

ఆ అంచనాలన్నీ తప్పులతడకలే: రతిన్‌ రాయ్‌
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ భారత వృద్ధి అంచనాలను కుదించడాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహా మండలి(ఈఏసీ–పీఎం) సభ్యుడు రతిన్‌ రాయ్‌ తోసిపుచ్చారు. ఆయా సంస్థల అంచనాలు అప్పుడప్పుడు ’తప్పు’ కూడా అవుతుంటాయని వ్యాఖ్యానించారు. ‘ఐఎంఎఫ్‌ వృద్ధి అంచనాలన్నీ సాధారణంగా 80% మేర తప్పవుతుంటాయి. ఇక ప్రపంచ బ్యాంకు అంచనాలు 65% తప్పవుతుంటాయి‘ అని డౌన్‌గ్రేడ్‌లపై స్పందిస్తూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. అయితే, మందగమనానికి కారణాల గురించి మండలి తప్పక పరిశీలిస్తుందని రాయ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు