బంగారానికి డిమాండ్‌ భారీ పతనం..

30 Apr, 2020 15:09 IST|Sakshi

ధర పెరిగినా పసిడి వెలవెలే..

ముంబై : బంగారానికి భారీ డిమాండ్‌ ఉండే భారత్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసంలో బంగారం డిమాండ్‌ ఏకంగా 36 శాతం పడిపోయింది. ధరల్లో ఒడిదుడుకులు, కరోనా మహమ్మారి వ్యాప్తితో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఈ కాలంలో బంగారం డిమాండ్‌ 101.9 టన్నులకే పరిమితమైంది. తొలి క్వార్టర్‌లో ఆభరణాల డిమాండ్‌, బంగారంలో పెట్టుబడులకు డిమాండ్‌ సైతం తగ్గిందని, ఇది స్వర్ణానికి సవాల్‌తో కూడిన సంవత్సరంగా మారే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదిక స్పష్టం చేసింది. 2019 తొలి త్రైమాసంలో భారత్‌లో బంగారానికి డిమాండ్‌ నగదు రూపంలో రూ 47,000 కోట్లు కాగా ఈ ఏడాది ఫస్ట్‌ క్వార్టర్‌ (జనవరి-మార్చి)లో అది రూ 37580 కోట్లకు పడిపోయిందని ఈ నివేదిక పేర్కొంది.

ధరలు పైపైకి..కొనుగోళ్లు డీలా..

ఇక గత ఏడాది ఇదే సమయంలో బంగారం ధరలు కస్టమ్స్‌ సుంకాలు, పన్నులు లేకుండా పదిగ్రాములకు రూ 29,555 కాగా ఈ ఏడాది మార్చి నాటికి పదిగ్రాముల పసిడి ఏకంగా 25 శాతం ఎగిసి రూ 36,875కు చేరిందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్‌ సోమసుందరం చెప్పారు. అధిక ధరలు, ధరల్లో అనిశ్చితి, కరోనా మహమ్మారి వంటి పలు కారణాలతో ఈ ఏడాది తొలి త్రైమాసంలో భారత్‌లో గోల్డ్‌ డిమాండ్‌ గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

చదవండి : బంగారు పండగపై కరోనా పడగ 

మహమ్మారితో కుదేలు

ఇక ఇదే కాలంలో ఆభరణాలకు డిమాండ్‌ సైతం 41 శాతం తగ్గిందని, రూపాయల్లో చూస్తే గత ఏడాది రూ 37,070 కోట్ల విలువైన ఆభరణాల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది తొలి మూడునెలల్లో అది 27 శాతం పతనమై రూ 27,230 కోట్లకు పడిపోయింది. ఏడాది ఆరంభంలో పసిడికి డిమాండ్‌, కొనుగోళ్లు బాగానే ఉన్నాయని, ఆ తర్వాత వెడ్డింగ్‌ సీజన్‌ కూడా ఆశాజనకంగానే మొదలైందని మార్చి ద్వితీయార్ధంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ అమలుతో పసిడి మార్కెట్‌ భారీగా పతనమైందని సోమసుందరం చెప్పుకొచ్చారు. మరోవైపు పసిడిలో పెట్టుబడుల డిమాండ్‌ కూడా ఈ క్వార్టర్‌లో తగ్గుముఖం పట్టిందని తెలిపారు.

మరిన్ని వార్తలు