ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే దేశానికి కీలకం

3 Feb, 2018 16:59 IST|Sakshi

సాక్షి, గువహటి: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ వృద్ధి వేగం పుంజుకుంటుదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అడ్వాంటేజ్ అస్సాం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 ను శనివారం  ప్రధాని ప్రారంభించారు. ఈ సందర‍్భంగా ఆయన మాట్లాడుతూ  ఈశ్యాన్య రాష్ట్రాలు, ప్రజలు అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించినపుడు మాత్రమే భారతదేశ వృద్ధి వేగం అందుకుంటుందన్నారు.

డూయింగ్ బిజినెస్ రిపోర్టులో ఈశాన్య రాష్ట్రాలలో అసోం మొదటి స్థానంలో నిలిచిందనీ ప్రశంసించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులో మరింత అభివృద్ధిని సాధించి దృఢంగా నిలబడనుందని చెప్పారు. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, సేంద్రీయ సాగు, వెదురు, చేనేత, వస్త్ర మరియు హస్తకళలు, లోతట్టు నీటి రవాణా, పోర్ట్ టౌన్‌షిప్‌, నదులు అభివృద్ధి, లాజిస్టిక్స్ లాంటి రంగాలను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈశాన్య ప్రజలకు, ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా  ఈ బడ్జెట్‌లో 1300 కోట్ల రూపాయలతో 'జాతీయ వెదురు మిషన్' ను ఏర్పాటు  చేయనున్నట్టు తెలిపారు.

కాగా అసోంలో శనివారం ప్రారంభమైన ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభు, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, జితేంద్ర సింగ్, కిరణ్‌ రిజిజు హాజరయ్యారు. వీరితోపాటు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, రతన్ టాటా వంటి పారిశ్రామికవేత్తలు కూడా హాజరైనారు.

>
మరిన్ని వార్తలు