ఈ ఏడాది భారత్‌ వృద్ధి 7.3%!

12 May, 2018 01:28 IST|Sakshi

 రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం (2018–19)లో 7.3 శాతానికి పుంజుకోవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2019–20)లో ఇది 7.5 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. గతేడాది(2017–18)లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌)కు ముందున్ననాటి స్థాయికి వ్యవస్థలో నగదు సరఫరా చేరుకోవడం, అదేవిధంగా వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) సంబంధిత అడ్డంకులు తొలగిపోవడం... వృద్ధి జోరుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.

గత నెలలో జరిపిన సమీక్షలో భారత్‌ సార్వభౌమ(సావరీన్‌) పరపతి రేటింగ్‌ను వరుసగా 12వ ఏడాది కూడా ఎలాంటి మార్పులూ చేయకుండా ఫిచ్‌ కొనసాగించిన సంగతి తెలిసిందే. పలు విప్లవాత్మక సంస్కరణలతోపాటు ద్రవ్యలోటు కట్టడికి కట్టుబడి ఉన్నామంటూ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా రేటింగ్‌ను పెంచేందుకు ఫిచ్‌ ససేమిరా అనడం గమనార్హం. కాగా, దీనిపై ఫిచ్‌ స్పందిస్తూ... ‘మధ్య, దీర్ఘకాలానికి వృద్ధి అంచనాలు మెరుగ్గానే ఉన్నాయి.

మరోపక్క, ఎగుమతులు ఇతరత్రా అంశాలు కూడా సానుకూలంగానే ఉన్నప్పటికీ... ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పుతుండటం, కంపెనీల పనితీరు ఏమంత ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రేటింగ్‌పై నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించింది. అయితే, ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణల అమలుతో  వ్యాపార వాతావరణం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని ఫిచ్‌ తెలిపింది. ఆసియా–పసిఫిక్‌ దేశాలకు సంబంధించి తాజా సావరీన్‌ పరపతి సమీక్షలో ఫిచ్‌ ఈ అంశాలను వెల్లడించింది.

ద్రవ్యలోటుపై దృష్టిపెట్టాలి...
మోదీ సర్కారు తాజా బడ్జెట్‌లో ఈ ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.3 శాతం నుంచి 3.5 శాతానికి  పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రుణ భారం పెరుగుతుండటం.. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తాము అంచనా వేసినదానికంటే ప్రభుత్వం వెనుకబడటం, ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అంతకంతకూ ఎగబాకడం వంటివి దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశాలని ఫిచ్‌ పేర్కొంది. ద్రవ్యలోటు కట్టడిపై మరింత దృష్టిసారించాలని సూచించింది.

మరిన్ని వార్తలు