ఐటీలో కొలువుల కోత

8 Jul, 2020 09:52 IST|Sakshi

కోవిడ్‌-19 ఎఫెక్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో లక్షలాది మందికి ఉపాథి కల్పించే ఐటీ పరిశ్రమ భారీ కుదుపులకు లోనవుతుంది. మహమ్మారి వ్యాప్తితో డిమాండ్‌ కొరవడిన కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగించడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ మెరుగుపడనిపక్షంలో భారత్‌లో సైతం ఇదే పరిస్థితి నెలకొంటుందని టెకీల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు సామర్థ్యం కనబరచని ఉద్యోగులను ఇంటికి పంపుతున్నామని చెబుతుండగా, మరికొన్ని కంపెనీలు ప్రాజెక్టులు లేవంటూ సిబ్బందిని వదిలించుకుంటున్నాయి. ప్రస్తుత వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా ఐటీ కంపెనీలు లేఆఫ్స్‌కు దిగాయని ఇటీవల పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న ధోరణి ఆధారంగా ఓ జాతీయ వెబ్‌సైట్‌ కథనం పేర్కొంది. 

తాజా ప్రాజెక్టులు కొనసాగడంపైనా స్పష్టత లేకపోవడంతో కొలువుల కోతకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆటోమేషన్‌తో పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడగా తాజాగా కోవిడ్‌-19తో ఈ పనిని మరింత వేగంగా ఐటీ కంపెనీలు ముందుకు తీసుకువెళుతున్నాయి. ఐబీఎం కార్పొరేషన్‌ ప్రపంచవ్యాప్తంగా 2000 మంది ఉద్యోగులపై వేటు వేయనుందని వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో భారత్‌లో​ పనిచేసే ఉద్యోగులూ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల తొలగింపుపై ఐబీఎం ఇంకా నోరుమెదపలేదు. మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఇటీవలే భారత్‌లో పలువురు ఉద్యోగులను తొలగించడాన్ని గుర్తుచేస్తూ ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితికి ఈ పరిణామాలు సంకేతమని చెబుతున్నారు. కోవిడ్‌-19తో లేఆఫ్స్‌ ఉండవని ఐటీ కంపెనీలు చెబుతున్నా ఐటీ సేవల డిమాండ్‌ ఇలాగే కొనసాగితే సామర్థ్యం ఆధారంగా ఉద్యోగులను కుదించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. చదవం‍డి : లేఆఫ్స్‌పై ముఖ్యమంత్రికి టెకీల లేఖ

మరిన్ని వార్తలు