అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్ను

22 Sep, 2015 01:46 IST|Sakshi
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్ను

టాప్ 5 నగరాల్లో కాలిఫోర్నియా.. భారతీయ ఐటీ కంపెనీలు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 5 అమెరికన్ నగరాల్లో కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలినాయి, న్యూజెర్సీ, న్యూయార్క్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగావకాశాలు దెబ్బతీస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది. అక్కడి స్థానికంగా నిపుణుల కొరతే దీనికి కారణమని వివరించింది.
 
- 4 లక్షల ఉద్యోగాల కల్పన
- 20 బిలియన్ డాలర్ల పన్నుల చెల్లింపు
- నాస్కామ్ నివేదిక
వాషింగ్టన్: 
ఉద్యోగాల కల్పన, పెద్ద ఎత్తున పన్నుల చెల్లింపు రూపంలో భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటు అందిస్తున్నాయని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఒక నివేదికలో పేర్కొంది. 2011-15 మధ్య కాలంలో అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలు దాదాపు 4,11,000 ఉద్యోగాలు కల్పించాయని, 20 బిలియన్ డాలర్ల మేర పన్నులు చెల్లించాయని, 2 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. అమెరికా ఎకానమీకి భారతీయ టెక్ పరిశ్రమ తోడ్పాటు పేరిట రూపొందించిన ఈ నివేదికను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు.

భారత్ అమెరికా మధ్య తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయుల నైపుణ్యాలను ఉపయోగించుకుని అమెరికా సంస్థలు వినూత్న ఆవిష్కరణలు, సేవలతో అంతర్జాతీయ మార్కెట్లో తమ వాటాను మెరుగుపర్చుకోగలిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే సామాజిక సంక్షేమ కార్యక్రమాల రూపంలో 1,20,000 మంది అమెరికన్లకు భారతీయ కంపెనీలు తోడ్పాటు అందించాయని వివరించారు. దీనికి తోడు ఫార్చూన్ 500 కంపెనీలతో పాటు వేల కొద్దీ అమెరికన్ వ్యాపార సంస్థలకు ఆర్థిక, నిర్వహణ అంశాలపరంగా భారతీయ ఐటీ కంపెనీలు గణనీయంగా సేవలు అందిస్తున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు