బ్రాడ్బ్యాండ్ మరింత మెరుగుపడాలి

12 Dec, 2016 15:14 IST|Sakshi
బ్రాడ్బ్యాండ్ మరింత మెరుగుపడాలి

శ్రీలంక, వియత్నాంల కన్నా వెనుకబడి ఉన్నాం
ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ

 న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశీయంగా డిజిటల్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగినప్పటికీ, వీటికి కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విషయంలో సింగపూర్, మలేషియా వంటి దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉందని పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దిష్ట ప్రమాణాలను బట్టి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ విసృ్తతి కేవలం 7 శాతమే ఉందని శర్మ చెప్పారు.

మరోవైపు ఇది సింగపూర్‌లో 98 శాతంగాను, థాయ్‌ల్యాండ్‌లో 36 శాతంగాను, మలేషియాలో 35-36 శాతం స్థారుులో ఉందని పేర్కొన్నారు. వాస్తవానికి బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో శ్రీలంక, వియత్నాంల కన్నా కూడా భారత్ వెనుకబడి ఉందని ఆయన చెప్పారు. ’బ్రాడ్‌బ్యాండ్‌కి సంబంధించి మన దగ్గర తగినన్ని సదుపాయాలు లేకపోవడం చాలా ఆందోళనకరమైన అంశం. ఇదే ఇన్‌ఫ్రాపై డిజిటల్ ఇండియా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. భారీ స్థారుులో, పటిష్టమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించలేము’ అని శర్మ చెప్పారు.

కేబుల్ టీవీ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలి
బ్రాడ్‌బ్యాండ్‌ను మరింతగా విసృ్తతిలోకి తేవడానికి కేబుల్ టీవీ మాధ్యమాన్ని మరింతగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇందుకోసం సంబంధిత నిబంధనలను స్వల్పంగా సవరిస్తే సరిపోతుందని, ట్రాయ్ ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సులు చేసిందని వివరించారు. దేశీయంగా కోట్ల సంఖ్యలో ఉన్న కేబుల్ టీవీ కనెక్షన్లను డిసెంబర్ ఆఖరు నాటికి డిజిటలైజ్ చేయనున్న నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఈ మాధ్యమాన్ని గణనీయంగా ఉపయోగించుకోవచ్చని శర్మ తెలిపారు. అమెరికా, యూరప్ వంటి పలు సంపన్న దేశాల్లో 50-60 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలకు డిజిటల్ కేబుల్ టీవీలే మాధ్యమంగా ఉంటున్నాయన్నారు.

>
మరిన్ని వార్తలు