రూపాయికి ‘ఇంధనం’...

21 Dec, 2018 00:03 IST|Sakshi

ఒకేరోజు 69 పైసలు ర్యాలీ; 69.70 వద్ద ముగింపు  

ముంబై: భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే క్రూడ్‌ ధరలు భారీ పతనం, దీనితో కరెంట్‌ అకౌంట్‌ లోటుపై (ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగ్గిన ఆందోళనలు రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 69 పైసలు రికవరీతో 69.70 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు (2.25–2.5 శాతం) పెంచినా కూడా రూపాయి బలపడటానికి ప్రధాన కారణం క్రూడ్‌ ధరలు దిగిరావడమేనని విశ్లేషణ. రూపాయి వరుసగా నాలుగు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ రికవరీ అవుతూ వస్తోంది. ఈ రోజుల్లో 220 పైసలు బలపడింది. అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు స్పీడు తగ్గుతుందన్న విశ్లేషణలు అటు డాలర్‌నూ కిందకు నెట్టడం గమనార్హం.  అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.
   
క్రూడ్‌ ధరలు చూస్తే... 
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి 30 డాలర్లకుపైగా కిందకు దిగాయి. న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్సే్చంజ్‌లో ట్రేడయ్యే లైట్‌ స్వీట్‌ బేరల్‌ ధర గురువారం ఒక దశలో 45.83ను తాకింది. ఈ వార్త రాసే 7 గంటల సమయంలో 46 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాదిన్నర కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది.  

ఈసీబీపై ఆర్‌బీఐ పరిమితులు 
ఇదిలాఉండగా, విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)కు సంబంధించి ఆర్‌బీఐ తాజాగా నియంత్రణలు విధించింది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో)లో ఈసీబీల పరిమాణం 6.5 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. దీని ప్రకారం, ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి ఈసీబీలు 160 బిలియన్‌ డాలర్లు దాటకూడదు. సెప్టెంబర్‌ 30 నాటికి ఈసీబీలు 126 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు