భారీగా పడిపోయిన ఉత్పాదకరంగం వృద్ధి!

2 Nov, 2015 13:07 IST|Sakshi
భారీగా పడిపోయిన ఉత్పాదకరంగం వృద్ధి!

న్యూఢిల్లీ: గడిచిన అక్టోబర్ నెలలో దేశ ఉత్పాదక రంగం (మాన్యుఫాక్చరింగ్ సెక్టర్)లో వృద్ధి భారీగా తగ్గింది. కొత్త ఆర్డర్‌లలో వృద్ధి లేకపోవడంతో 22నెలల కనిష్ఠస్థాయికి ఉత్పాదకరంగం ఉత్పత్తి పడిపోయింది. అయినప్పటికీ గడిచిన నెలలో పరిశ్రమలు అదనపు కార్మికులను నియమించుకున్నాయని నిక్కీ సర్వే తెలిపింది. నిక్కీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 'పీఎంఐ' అక్టోబర్‌ నెలకుగాను 50.7శాతంగా ఉంది. మాన్యుఫాక్చరింగ్ రంగం పనితీరును సూచిస్తూ ప్రతి నెల దీనిని నిక్కీ విడుదల చేస్తుంది.

సెప్టెంబర్ నెలలో ఇది 51.2శాతం ఉండగా.. ప్రస్తుతం తగ్గిపోవడం ఉత్పాదక రంగంలో నెలకొన్న బలహీనమైన వ్యాపార వాతావరణాన్ని సూచిస్తున్నది. 'భాతర మాన్యుఫాక్చరింగ్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అవకాశాలు దెబ్బతింటున్న వైనాన్ని పీఎంఐ డాటా సూచిస్తున్నది. కొత్త వ్యాపారాల ఇన్‌ఫ్లో తగ్గడంతో ఈ రంగంలో ఉత్పత్తి కూడా తగ్గుతున్నది. ఇదే వృద్ధి మందగమనానికి కారణం' అని ఈ నివేదిక రచయిత, ఆర్థికవేత్త పాలీయన్నా డె లిమా తెలిపారు. కొత్త ఆర్డర్ల వృద్ధిలో మందగమనం ఉన్నప్పటికీ, ఉత్పాదకరంగంలో అక్టోబర్‌లో కొత్త నియామకాలు జరిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

 

>
మరిన్ని వార్తలు