పుంజుకున్న ఎగుమతులు

10 May, 2014 01:51 IST|Sakshi
పుంజుకున్న ఎగుమతులు

వృద్ధి 5.26 శాతం  5 నెలల గరిష్ట స్థాయి

* ఏప్రిల్‌లో విలువ 25.63 బిలియన్ డాలర్లు
* 2013 ఏప్రిల్‌లో ఈ విలువ 24.35 బిలియన్ డాలర్లు
* 2014 మార్చితో పోల్చితే ‘విలువ’ మాత్రం నిరాశే!
 
 న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో ఐదు నెలల గరిష్ట స్థాయిలో నమోదయ్యింది. ఈ రేటు 5.26 శాతమని శుక్రవారం విడుదలైన గణాంకాలు పేర్కొన్నాయి. అంటే గడచిన ఐదు నెలల కాలంలో ఇంత రేటు (5.26 శాతం)లో ఎగుమతుల వృద్ధి నమోదుకాలేదన్నమాట. విలువ రూపంలో చూస్తే 2013 ఏప్రిల్‌లో ఎగుమతుల విలువ 24.35 బిలియన్ డాలర్లుకాగా, 2014 ఏప్రిల్‌లో ఈ విలువ 25.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అయితే సీక్వెన్షియల్‌గా ఇదే ఏడాది మార్చితో పోల్చితే మాత్రం ఎగుమతుల విలువ ఏప్రిల్‌లో తగ్గడం నిరాశ కలిగించే విషయం. ఈ విలువ 2014 మార్చిలో 29.57 బిలియన్ డాలర్లు.

 దిగుమతులు మైనస్‌లోనే...
 ఇక దిగుమతులు విషయానికి వస్తే, అటు వార్షికంగా చూసుకున్నా, ఇటు నెలవారీగా చూసుకున్నా... అసలు వృద్ధిలేకపోగా క్షీణబాటలోనే (మైనస్) కొనసాగుతున్నాయి. 2013 ఏప్రిల్‌లో దిగుమతుల విలువ 42.02 బిలియన్ డాలర్లయితే ఈ విలువ 2014 ఏప్రిల్‌లో 35.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే వార్షికంగా 14.99 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ఇక స్వీక్వెన్షియల్‌గా మార్చి గణాంకాలను చూస్తే ఈ విలువ 40.08 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల విలువ వార్షికంగా 0.6 శాతం తగ్గి, 13.05 బిలియన్ డాలర్ల నుంచి 12.97 బిలియన్ డాలర్లకు తగ్గింది. చమురు యేతర దిగుమతుల విలువ 21.5 శాతం క్షీణతతో 28.97 బిలియన్ డాలర్ల నుంచి 22.74 బిలియన్ డాలర్లకు దిగింది.

 వాణిజ్యలోటు
 ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 10.09 బిలియన్ డాలర్లుగా ఉంది. 2013 ఏప్రిల్‌లో ఈ విలువ 17.8 బిలియన్ డాలర్లు. స్వీక్వెన్షియల్‌గా 2014 మార్చిలో ఈ విలువ 10.5 బిలియన్ డాలర్లు.

 బంగారం ఎఫెక్ట్...
 వాణిజ్యలోటు వార్షిక ప్రాతిపదికన భారీగా దిగిరావడానికి (17.8 బిలియన్ డాలర్ల నుంచి 10.09 బిలియన్ డాలర్లకు) పసిడి దిగుమతుల విలువ భారీగా తగ్గడం ప్రధాన కారణం. 2013 ఏప్రిల్‌లో పసిడి దిగుమతులు విలువ 6.78 బిలియన్ డాలర్లుకాగా, 2014 ఏప్రిల్‌లో ఈ విలువ 74 శాతం పడిపోయి 1.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా ఈ మెటల్ దిగుమతులపై 10 శాతం వరకూ సుంకాలు పెంపుసహా ప్రభుత్వం విధించిన పలు ఆంక్షలు దీనికి ప్రధాన కారణం. ఇక బంగారం, వెండి రెండు మెటల్స్‌నూ పరిగణనలోకి తీసుకుంటే ఈ దిగుమతుల విలువ 2013 మార్చిలో 7.42 బిలియన్ డాలర్లు కాగా, ఈ పరిమాణం 2014 ఏప్రిల్‌లో 70 శాతానికి పైగా పడి, 2.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.

 మిగిలిన ముఖ్య రంగాలు...
 ఇంజనీరింగ్, సముద్ర, లెదర్ ఉత్పత్తుల ఎగుమతులు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇంజనీరింగ్ రంగం నుంచి ఎగుమతుల వృద్ధి రేటు 21.25 శాతంకాగా, సముద్ర ఉత్పత్తుల విషయంలో 42.18 శాతంగా, లెదర్ ఉత్పత్తుల్లో 30.42 శాతంగా నమోదయ్యాయి. ముడి ఇనుము ఎగుమతులు కూడా 23.43 శాతం పెరిగి, 15.2 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మాత్రం 8 శాతం పడి, 3.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ రంగంలో దిగుమతులమీద ఉన్న ఆంక్షలు దీనికి కారణమని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.  ఔషధ, రసాయన రంగాల్లో ఎగుమతుల వృద్ధి రేటు 10.4 శాతం, 4.13 శాతంగా నమోదయ్యాయి. విద్యుత్, రెడీమేడ్ దుస్తుల విషయంలో ఈ రేట్లు 4 శాతం, 14.3 శాతం చొప్పున నమోదయ్యాయి. అయితే హస్త కళలు, పండ్లు, కూరగాయలు, జీడిపప్పు, పొగాకు, బియ్యం, టీ, కాఫీ ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. ఇక ఎరువులు, విలువైన రంగురాళ్లు, ఇనుము, ఉక్కు, రవాణా పరికరాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు తగ్గాయి.

మరిన్ని వార్తలు