ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్‌ చౌక..

3 Dec, 2019 05:05 IST|Sakshi

టెలికం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్‌ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్‌.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్‌ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్‌ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది.

దేశీ టెల్కోలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌–ఐడియా, రిలయన్స్‌ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్‌ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే.  దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్‌ ఇంటర్నెట్‌ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటీఎన్‌ఎల్‌ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు