730 మిలియన్ డాలర్లకు భారత క్లౌడ్ సర్వీసులు

27 Oct, 2015 01:05 IST|Sakshi
730 మిలియన్ డాలర్లకు భారత క్లౌడ్ సర్వీసులు

న్యూఢిల్లీ: దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల రంగ ఆదాయాలు ఈ ఏడాది ఆఖరు నాటికి 730 మిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్‌నర్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 31 శాతం వృద్ధి సాధించగలదని పేర్కొంది. భారత్‌లో క్లౌడ్ సేవలపై భారీగా వ్యయాలు పెరుగుతాయని, 2019 నాటికి ఇవి 19 బిలియన్ డాలర్లకు చేరొచ్చని గార్ట్‌నర్ వివరించింది. ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్), క్లౌడ్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్‌ఏఏఎస్) మొదలైన విభాగాలు గణనీయమైన వృద్ధి కనపర్చగలవని గార్ట్‌నర్ తెలిపింది.

2015లో ఐఏఏఎస్‌పై వ్యయాలు 100 మిలియన్ డాలర్లకు (25% వృద్ధి), క్లౌడ్ మేనేజ్‌మెంట్/సెక్యూరిటీపై 82 మిలియన్ డాలర్లకు (36.6%), ఎస్‌ఏఏఎస్‌పై 302 మిలియన్ డాలర్ల స్థాయికి (33.4% వృద్ధి) పెరగగలవని పేర్కొంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు, స్థానిక మార్కెట్లలో డిమాండ్, సరఫరా పరిస్థితులు మొదలైన వాటిపై క్లౌడ్ సర్వీసుల అంచనాలు ఆధారపడి ఉంటాయని గార్ట్‌నర్ రీసెర్చ్ డెరైక్టర్ సిడ్ నాగ్ తెలిపారు. భారత కంపెనీలు సొంతంగా ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేసుకోవడం కంటే ఐఏఏఎస్, ఎస్‌ఏఏఎస్ వంటి వాటివైపు మొగ్గు చూపుతున్నాయనడానికి తాజా పరిణామాలు నిదర్శనమని వివరించారు.

మరిన్ని వార్తలు