భారత్ రేటింగ్‌పై లోటు ప్రభావం ఉండదు: మూడీస్

14 Jan, 2016 02:21 IST|Sakshi
భారత్ రేటింగ్‌పై లోటు ప్రభావం ఉండదు: మూడీస్

న్యూఢిల్లీ: భారత స్వల్పకాలిక రేటింగ్స్‌పై ద్రవ్య లోటు గణాంకాల స్వల్ప పెరుగుదల, తగ్గుదల ప్రభావాలు పెద్దగా ఉండబోవని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. భారత ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బలహీనంగా ఉందని, లోటు కట్టడి లక్ష్యాలు సాధించినా కూడా పరిస్థితి అలాగే ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాల ప్రభావమనేది రేటింగ్‌పై ఎక్కువగా ఉండబోదని మూడీస్ అసోసియేట్  ఎండీ అత్సి సేఠ్ వివరించారు.

ప్రస్తుతం మూడీస్ భారత్‌కు సానుకూల అంచనాలతో ‘బీఏఏ3’ రేటింగ్ ఇచ్చింది. తామిచ్చే రేటింగ్ వృద్ధి ఆధారంగానే ఉంటుందని, విధానాల్లో మార్పులను బట్టి ఉండదని సేఠ్ తెలిపారు. అందుకే, 2002-03 నుంచి 2007-08 మధ్య కాలంలో ద్రవ్య లోటు ఏకంగా 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గినప్పటికీ తాము రేటింగ్‌ను పెంచలేదని ఆమె పేర్కొన్నారు.

 వచ్చే ఏడాది వృద్ధి 7.7 శాతం..
 భారత్ వృద్ధి ధోరణికి కార్పొరేట్ ఫలితాలు, ద్రవ్యోల్బణమే కీలకమని మూడీస్ దేశీయ అనుబంధ విభాగం ఐసీఆర్‌ఏ రేటింగ్స్ పేర్కొంది. అయినా... 2016లో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2015-16లో భారత్‌లో 7.2%, 2016-17లో 7.7% వృద్ధి ఉంటుందని అంచనావేసింది.
 

మరిన్ని వార్తలు