క్యూ2 లో పుంజుకున్న జీడీపీ వృద్ధిరేటు

30 Nov, 2017 19:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  గత త్రైమాసికంలో 5.7 శాతానికి పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మళ్లీ పుంజుకుంది.  ముఖ్యంగా నిర్మాణ రంగంలో వృద్ధితో జులై-సెప్టెంబర్ మధ్య వృద్ధిరేటు 6.3 శాతంగా నమోదైంది. 2017-18 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వరుసగా ఐదు త్రైమాసికాల నుంచి నెమ్మదిగా ఉన్న దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు తిరిగి పుంజుకోవడం గమనార‍్హం.  

తాజాగా కేంద్ర గణాంకశాఖ వెల్లడించిన డేటా ప్రకారం రెండో త్రైమాసికంలో తిరిగి 6శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా క్యూ2లో జీడీపీ వృద్ధిరేటు 6.4శాతానికి చేరుతుందని నిపుణులు  అంచనా వేశారు.  తయారీ రంగం, విద్యుత్‌, గ్యాస్‌, మంచినీటి సరఫరా, ట్రేడ్‌, హోటల్స్‌, రవాణా, సేవల రంగాల్లో వృద్ధిరేటు పెరిగింది.

గనుల త్రవ్వకాలు, క్వారీ, వర్తకం, హోటళ్లు వరుసగా 12.9 శాతం,12.2  శాతం పెరిగాయి. తయారీ రంగం రెండో త్రైమాసికంలో ఉత్పాదకత 9.5 శాతం పెరగగా, వ్యవసాయ రంగం కేవలం 3.7 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది.

మరోవైపు నిర్మాణరంగంలో వృద్ధి జీడీపీ వృద్ధిరేటులో కీలకపాత్ర పోషించడం గమనించాల్సిన విషయమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  ట్విట్టర్‌లో  వ్యాఖ్యానించారు.  ఆర్ధిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం తయారీ రంగంలో కనిపించిందని తెలిపారు. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాలు మెల్లగా తొలగిపోతున్నాయని, రానున్న త్రైమాసికాల్లో వృద్ధిరేటు పరుగులు పెడుతుందన్న విశ్వాసాన్ని  ఆర్థికమంత్రి వ్యక్తంచేశారు.
 

మరిన్ని వార్తలు