కరోనా : ఇండిగో వేతనాల కోత

19 Mar, 2020 14:44 IST|Sakshi

సాక్షి, ముంబై : కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రకంపనలు పలు రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌గా విమానయానరంగం మరింత కుదేలవుతోంది.  దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో డిమాండ్‌ పడిపోయి దాదాపు సగం విమానాలను ఖాళీగా ఎగురుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమాన యాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులను నిలిపివేయడంతోపాటు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనుంది. వివిధ స్థాయిలలో జీతం కోతలను ప్రకటిస్తూ ఉద్యోగులకు ఈ మెయిల్‌ సమాచారాన్ని అందించింది.  ఇండిగో సీఈవో రణుంజోయ్‌ దత్తా తన వేతనంలో 25 శాతం , సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఆపైన ఉద్యోగుల్లో 20 శాతం వేతన కోత వుంటుందని ఉద్యోగులకు రాసిన మెయిల్‌లో పేర్కొన్నారు. జీతాలలో అన్ని మార్పులు 2020 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి.

భారతదేశపు అతిపెద్ద క్యారియర్ ఇండిగో మొత్తం 260 విమానాలలో 16 విమానాలను నిలిపివేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై కరోనావైరస్ ప్రభావంతో  10-20 శాతం జీతం కోత విధించుకోవాలని ఎయిర్లైన్స్ తన ఉద్యోగులను కోరుతోంది. స్వయంగా ఇండిగో సీఈవో రణుంజోయ్‌ దత్తా తన వేతనంలో 25 శాతం తగ్గించుకున్నట్టు ప్రకటించారు. ఆదాయాలు భారీగా క్షీణించాయి. విమానయాన పరిశ్రమ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉందని దత్తా వెల్లడించారు. కరోనా ప్రభావంతో విమానయాన రంగంలో ఆర్థిక వాతావరణం గణనీయంగా ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఇండిగో ఉద్యోగులు సంక్షోభంలో పడిపోయారు.

ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ  సీఏపీఏ సమాచారం ప్రకారం ఇండిగో  మొదట్లో 150 విమానాలను నిలిపి  వేయనుంది. రాబోయే వారాల్లో  ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ట్రాఫిక్ క్షీణత తీవ్రంగా కొనసాగితే, ఏప్రిల్ నాటికి మెజారిటీ విమానాలను నిలిపివేయవచ్చు. ఈ ప్రభావంవిమానయాన సిబ్బందిపై 30శాతం,  50 శాతం వరకు గ్రౌండ్‌ స్టాఫ్‌ మీద పడనుందని భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు