అదనపు బ్యాగేజీపై ఇక ఛార్జీల బాదుడే

23 Jun, 2018 17:03 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశీయ విమానాల్లో 15 కేజీల కంటే అదనంగా చెక్‌-ఇన్‌ బ్యాగేజీ తీసుకెళ్తున్నారా? అయితే ఇక మీకు ఛార్జీల మోత మోగినట్టేనట. ప్రైవేట్‌ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌లు అదనపు బ్యాగేజీల ప్రీ-బుకింగ్‌ ఛార్జీలను, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద చెల్లించే అదనపు చెక్‌-ఇన్‌ బ్యాగేజీల ఛార్జీలను పెంచేశాయి. ఎయిర్‌పోర్టుల వద్ద 15 కేజీలకు మించి అదనపు బ్యాగేజీని తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపితే, ఒక్కో కిలోకు ప్రస్తుతం 400 రూపాలను ఛార్జ్‌ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. 

ఇండిగో అదనపు బ్యాగేజీ ఛార్జీలను మూడో వంతు లేదా 33 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రీ-బుకింగ్‌ చేసుకునేటప్పుడు దేశీయ ప్రయాణికులు ఉచితంగా అందించే 15 కేజీలను మించి మరో 5, 10, 15, 30 కేజీలను తీసుకెళ్తున్నట్టు నమోదు చేస్తే, ఇక నుంచి రూ.1900, రూ.3800, రూ.5700, రూ.11,400ను చెల్లించాల్సి ఉంటుంది. గత ఆగస్టులోనే ఇండిగో ఈ ఛార్జీలను పెంచింది. తాజాగా మరోసారి కూడా వీటిని పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఇక స్పైస్‌జెట్‌ సైతం 5, 10, 15, 20, 30 కేజీల అదనపు బ్యాగేజీకి విధించే ప్రీబుక్‌ ఛార్జీలను రూ.1600, రూ.3200, రూ.4800, రూ.6400, రూ.9600కు పెంచుతున్నట్టు తెలిపింది. ఎవరైతే ప్రీబుక్‌ చేసుకోరో వారు అదనపు చెక్‌-ఇన్‌ బ్యాగేజీకి ఒక్కో కిలోకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

గోఎయిర్‌ అదనపు బ్యాగేజీ ఛార్జీలు అచ్చం ఇండిగో మాదిరిగానే ఉన్నాయి. ప్రభుత్వం రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రమే 25 కేజీల వరకు చెక్‌-ఇన్‌ బ్యాగేజీని ఉచితంగా అనుమతి ఇస్తోంది. గతేడాది ఆగస్టు వరకు ఎయిర్‌లైన్స్‌ అన్నీ 15 కేజీలకు మించి.. తొలి ఐదు కిలోల అదనపు బ్యాగేజీకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఛార్జ్‌ చేసేవి. డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఎయిర్‌లైన్స్‌ నడుచుకునేవి. కానీ డీజీసీఏ ఆదేశాలను కోర్టులో సవాల్‌ చేసిన ఎయిర్‌లైన్స్‌, 15 కేజీలకు మించిన తర్వాత విధించే అదనపు బ్యాగేజీ ఛార్జీలను అవి మాత్రమే నిర్ణయించుకునేలా ఆదేశాలను తెచ్చుకున్నాయి.  
 

మరిన్ని వార్తలు