లోన్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

6 May, 2019 08:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైతు రుణమాఫీ తరహాలోనే భిన్న వర్గాలకు రుణ భారం నుంచి ప్రభుత్వాలు ఊరట కల్పిస్తున్న నేపథ్యంలో వ్యక్తులకు సైతం రుణ బాధల నుంచి విముక్తి కల్పించే పధకానికి అధికారులు తుదిరూపు ఇస్తున్నారు. రూ 60,000లోపు రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడే వ్యక్తులు రుణ మాఫీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించనుంది. అల్పాదాయ వర్గాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ నూతన రుణమాఫీ పధకాన్ని దివాళా చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఇన్‌సాల్వెన్సీ లా కమిటీ (ఐఎల్‌సీ) ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్తగా కొలువుతీరే ప్రభుత్వానికి ఐఎల్‌సీ తన ప్రతిపాదనలను సమర్పించనుంది. కాగా ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలకే దివాళా చట్టం వర్తిస్తుండటంతో మలిదశలో ఈ ప్ర్రక్రియను భాగస్వామ్య సంస్ధలు, వ్యక్తులకూ వర్తింపచేయనున్నారు. కార్పొరేట్‌ దిగ్గజాలకు ఇచ్చిన రుణాలను హెయిర్‌ కట్‌ పేరుతో కుదిస్తున్న క్రమంలో ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులకూ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

ఇక వ్యక్తులకు గరిష్టంగా రూ 60,000 వరకూ రుణ మాఫీని వర్తింపచేస్తారు. చెల్లించాల్సిన రుణం రూ 60,000కు మించడం‍తో పాటు వార్షికాదాయం మెరుగ్గా ఉంటే అలాంటి వ్యక్తుల రుణ మాఫీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.

మరిన్ని వార్తలు