‘నారీ’ శక్తి వీరిదే!!

27 Sep, 2017 00:50 IST|Sakshi

 ఫార్చ్యూన్‌ జాబితాలో కొచర్, శిఖా, నూయి

న్యూయార్క్‌: ఔను! స్త్రీలు శక్తివంతులే. ఆ రంగం ఈ రంగం అంటూ లేకుండా అన్ని చోట్లా వారి హవా కనిపిస్తోందిపుడు. వ్యాపార విభాగంలోనూ పవర్‌ఫుల్‌ మహిళలు అవతరిస్తున్నారు. ఫార్చ్యూన్‌ తాజా గా అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. ఇద్దరూ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన వారే కావడం గమనార్హం.

ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచర్‌ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అన బొటిన్‌ అగ్రస్థానంలో నిలవగా... జీఎస్‌కే సీఈవో ఎమ్మా వాల్మ్‌స్లే రెండో స్థానంలో, ఎంజీ సీఈవో ఇసబెల్లా కొచర్‌ మూడో స్థానంలో నిలిచారు. ‘ఎనిమిదేళ్లుగా భారత్‌లోని అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐకి చందా కొచర్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈమె సారథ్యంలో బ్యాంక్‌ మంచి వృద్ధి బాటలో పయనిస్తోంది’ అని ఫార్చ్యూన్‌ పేర్కొంది. ‘భారత్‌లోని మూడో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా శిఖా శర్మ రెండోమారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె డిజిటల్‌ సర్వీసులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు’ అని తెలిపింది.

మరొక జాబితాలో ఇంద్రా నూయి
ఫార్చ్యూన్‌.. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన మహిళల పేరిట మరో జాబితాను ప్రకటించింది. దీన్లో పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జనరల్‌ మోటార్స్‌ చైర్మన్, సీఈవో మేరి బర్రా టాప్‌లో ఉన్నారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌ చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో మారిల్లిన్‌ హేవ్సన్‌ మూడో స్థానంలో నిలిచారు.a

మరిన్ని వార్తలు