ఇండస్‌ ఇండ్‌ లాభం 26% అప్‌

12 Jul, 2017 00:37 IST|Sakshi
ఇండస్‌ ఇండ్‌ లాభం 26% అప్‌

జూన్‌ త్రైమాసికంలో రూ.837 కోట్లు
వడ్డీ ఆదాయం దన్నుతో
రూ.836 కోట్లుగా నమోదు
స్వల్పంగా పెరిగిన ఎన్‌పీఏలు  


ముంబై: ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు అనుగుణంగా రాణించింది. నికర వడ్డీ ఆదాయం దన్నుతో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికరలాభం 26 శాతం అధికంగా రూ.836.55 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.661 కోట్లే. నికర వడ్డీ ఆదాయమైతే 31 శాతం వృద్ధితో 1,774.06 కోట్లకు చేరుకుంది. గతంలో ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతాన్ని బ్యాంకు తాజాగా ముగిసిన త్రైమాసికంలోనూ నిలబెట్టుకోగలిగింది. వడ్డీయేతర ఆదాయంలోనూ పెరుగుదల నమోదైంది. 20 శాతం అధికంగా రూ.1,167.26 కోట్లు ఆర్జించింది. రుణాల్లో 24 శాతం, డిపాజిట్లలో 31 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. తక్కువ వ్యయాలుండే కరెంట్, సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లు కూడా 38 శాతానికి పెరిగాయి.

తగ్గిన ఆస్తుల నాణ్యత
స్థూల ఎన్‌పీఏలు అంతకుముందున్న 0.91 శాతం నుంచి 1.09 శాతానికి పెరిగాయి. పునరుద్ధరించిన రెండు రుణాలు మొండి బకాయిలుగా (ఎన్‌పీఏ) మారడమే దీనికి కారణమని బ్యాంకు ఎండీ రమేశ్‌ సోబ్తి తెలిపారు. ఈ కాలంలో బ్యాంకు ఎన్‌పీఏలకు చేసిన మొత్తం కేటాయింపులు రూ.230 కోట్ల నుంచి రూ.310 కోట్లకు పెరిగాయి. జేపీ సిమెంట్‌కు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవడంతో అంతకుముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రూ.122 కోట్లను నష్టాలుగా చూపించి పక్కన పెట్టింది. జేపీ సిమెంట్‌ను రూ.16,000 కోట్లకు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో, నష్టాల పేరుతో పక్కన పెట్టిన నిధులను అప్పుడే లాభాల్లోకి తీసుకోకూడదని బ్యాంకు నిర్ణయించింది.

ఆర్‌బీఐ దివాలా చట్టం కింద చర్యలకు గుర్తించిన 12 భారీ ఎన్‌పీఏ కేసుల్లో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఇచ్చిన రుణాలు రూ.50 కోట్ల మేర ఉండగా, వాటికి జూన్‌ త్రైమాసికంలో తగిన నిధుల కేటాయింపులు చేసినట్టు రమేశ్‌సోబ్తి తెలిపారు. జీఎస్టీ అమలు, బీఎస్‌–4 కాలుష్య నియంత్రణ ప్రమాణాలు ట్రక్‌ సరఫరాలపై పడడంతో ఈ విభాగంలో రుణ వృద్ధి మందగించిందన్న ఆయన సెప్టెంబర్‌ క్వార్టర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. వాహనేతర వినియోగ రుణాల్లో మాత్రం 35–40 శాతం వృద్ధి ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు