ఇండస్‌ఇండ్‌- యస్‌ బ్యాంక్‌.. జోరు

8 Jul, 2020 11:17 IST|Sakshi

పెట్టుబడులకు రూట్‌ వన్‌ రెడీ!

5 శాతం జంప్‌చేసిన ఇండస్‌ఇండ్‌ 

నిధుల సమీకరణ ప్రణాళికలకు ఓకే

3 శాతం లాభపడిన యస్‌ బ్యాంక్‌ షేరు

ప్రపంచ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 36 పాయింట్లు క్షీణించి  36,638కు చేరగా.. నిఫ్టీ 7 పాయింట్లు తక్కువగా 10,793 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల ప్రభావంతో ప్రయివేట్‌ రంగ సంస్థలు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
హిందుజా గ్రూప్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో యూఎస్‌ హెడ్జ్‌ ఫండ్‌.. రూట్‌ వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వాటాను పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 5.25 శాతం జంప్‌చేసి రూ. 554 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వరకూ ఎగసింది. గత 7 ట్రేడింగ్‌ సెషన్లలోనూ ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! బ్యాలన్స్‌షీట్‌ను పటిష్ట పరచుకోవడంతోపాటు నిధుల సమీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఇటీవల పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇండస్‌ఇండ్‌లో రూట్‌ వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీకి ప్రస్తుతం 5.41 శాతం వాటా ఉంది. ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా ఈ వాటాను 9.9 శాతానికి పెంచుకునే యోచనలో రూట్‌ వన్‌ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందుకు బ్యాంక్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వవలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మరోవైపు బ్యాంక్‌ ప్రమోటర్లు సైతం తమ వాటాను ప్రస్తుత 14.34 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

యస్‌ బ్యాంక్‌
నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం బలపడి రూ. 26.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 27 వరకూ పెరిగింది. బ్యాంక్‌ బోర్డుకి చెందిన పెట్టుబడుల పెంపు కమిటీ(సీఆర్‌సీ) ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా నిధుల సమీకరణకు అనుమతించినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఈ నెల 10న నిర్వహించనున్న సమావేశంలో సీఆర్‌సీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలియజేసింది.  

మరిన్ని వార్తలు