ఇండస్‌ఇండ్‌ లాభం 953 కోట్లు 

20 Apr, 2018 00:04 IST|Sakshi

27 శాతం వృద్ధి  

ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ 

పెరిగిన మొండిబకాయిలు 

ముంబై: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.953 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం (రూ.752 కోట్లు)తో పోల్చితే 27 శాతం వృద్ధి సాధించామని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, నికర లాభం రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించిందని  బ్యాంక్‌ సీఈఓ రమేశ్‌ సోబ్తి పేర్కొన్నారు.  మొత్తం ఆదాయం రూ.5,041 కోట్ల నుంచి రూ.5,859 కోట్లకు పెరిగిందని తెలిపారు. వడ్డీ ఆదాయం రూ.3,830 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.4,650 కోట్లకు పెరిగిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.  నికర వడ్డీ ఆదాయం 20% వృద్ధితో రూ.2,008 కోట్లకు పెరిగిందని రమేశ్‌ సోబ్తి చెప్పారు. నికర వడ్డీ మార్జిన్‌  3.97%కి తగ్గిందని, 4% నికర వడ్డీ మార్జిన్‌ సాధించడం లక్ష్యమని వివరించారు. వాహన రుణాలు 47%, వాహనేతర రుణాలు 30%, కార్పొరేట్‌ రుణాలు 30 శాతం చొప్పున పెరిగాయని, మొత్తం మీద 28% రుణ వృద్ధి సాధించామని పేర్కొన్నారు.  నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26% పెరి గి రూ.3,606 కోట్లకు పెరిగిందని సోబ్తి తెలిపారు. మొత్తం ఆదాయం రూ.18,577 కోట్ల నుంచి రూ.22,031 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

పెరిగిన మొండి బకాయిలు...: బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు 1.17 శాతం పెరిగి రూ.1,700 కోట్లకు, నికర మొండి బకాయిలు 0.51 శాతం పెరిగి రూ.750 కోట్లకు పెరిగాయని సోబ్తి పేర్కొన్నారు. దీంతో కేటాయింపులు క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 42% వృద్ధి చెంది రూ.335 కోట్లకు పెరిగాయని తెలిపారు.  

ఈ బ్యాంక్‌ సైతం అదే బాట... 
మొండి బకాయిలను తక్కువ చేసి చూపించిన ప్రైవేట్‌ రంగ బ్యాంకులు..ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ల సరసన తాజాగా ఈ బ్యాంక్‌ కూడా చేరింది.  ఇటీవలే వేరే కంపెనీలో విలీనమైన సిమెంట్‌ కంపెనీకి చెందిన రూ.1,350 కోట్ల మొండి బకాయిలను ఈ బ్యాంక్‌ తక్కువ చేసి చూపించిందని ఆర్‌బీఐ ఆడిట్‌లో వెల్లడైంది. అయితే ఈ ఎన్‌పీఏలకు సమీక్షా క్వార్టర్‌లో పూర్తిగా కేటాయింపులను ఈ బ్యాంక్‌  జరిపింది.  

ఎగసిపడిన షేర్‌... 
ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఇంట్రాడేలో 3 శాతం వరకూ ఈ షేర్‌ ఎగసింది. మొండి బకాయిలను తక్కువ చేసి చూపిందని వెల్లడి కావడంతో నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 0.6% నష్టంతో రూ.1,834 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు