జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి!

12 Aug, 2017 01:25 IST|Sakshi
జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి!

జూన్‌ నెల్లో వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణత
ఈ తరహా ఫలితం ఏడాదిలో ఇదే తొలిసారి
తయారీ, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల బలహీనత
మరింత రేటు కోత తప్పదంటున్న
పారిశ్రామిక ప్రతినిధులు  


న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం ఉత్పత్తి జూన్‌ నెల్లో అత్యంత నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణతలోకి జారిపోయింది.  అంటే 2016 జూన్‌ నెల ఉత్పత్తితో పోల్చితే 2017 జూన్‌ నెలలో  ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణించిందన్నమాట. 2016 జూన్‌ నెలలో వృద్ధి భారీగా 8 శాతంగా ఉంది.  గడచిన 12 నెలల కాలాన్ని చూస్తే, ‘క్షీణ’ ఫలితం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఇక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) చూసినా, వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది.  తాజా ఫలితం నేపథ్యంలో తక్షణం పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) తప్పదని పారిశ్రామిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. .

అన్ని రంగాలూ నేలచూపే...
తయారీ: 2016 జూన్‌ నెలలో 7.5 శాతం వృద్ధి 2017 జూన్‌లో ఏకంగా –0.4 శాతం క్షీణతకు జారింది. ఇక త్రైమాసికంగా చూస్తే ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి పడింది. ఈ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాన్ని చూశాయి.
మైనింగ్‌: నెలలో వృద్ధి రేటు 10.2 శాతం నుంచి 0.4 శాతానికి జారింది. మూడు నెలల్లో ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి చేరింది.
విద్యుత్‌: వృద్ధి రేటు నెల్లో 9.8 శాతం నుంచి 2.1 శాతానికి చేరింది. త్రైమాసికంలో రేటు 10 శాతం నుంచి 5.3 శాతానికి పడిపోయింది.
కేపిటల్‌ గూడ్స్‌: భారీ పరిశ్రమల వస్తు ఉత్పత్తికి, డిమాండ్‌కు సూచిక అయిన ఈ రంగంలో రేటు 14.8 శాతం వృద్ధి నుంచి 6.8 శాతం క్షీణతకు పడిపోయింది.
వినియోగం: కన్జూమర్‌ డ్యూరబుల్స్‌లో – 2.1 శాతం క్షీణ వృద్ధి నమోదయితే, నాన్‌–డ్యూరబుల్స్‌ విషయంలో 4.9 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది.

మరిన్ని వార్తలు